ఖమ్మం, జనవరి 15: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాల క్షేత్రస్థాయి సర్వేల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. ఈ అంశంపై అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి ఆయా శాఖల అధికారులతో ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాల విధివిధానాలను ప్రభుత్వం జారీ చేసిందని అన్నారు. వీటిపై అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు.
లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. రైతుభరోసా కోసం వ్యవసాయ యోగ్యమైన, వ్యవసాయ యోగ్యంకాని భూములను గుర్తించేందుకు నేటి నుంచి సర్వే చేపట్టాలని ఆదేశించారు. వచ్చే నెల 1లోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే, ఈ నెల 20 నుంచి గ్రామసభల నిర్వహణకు కార్యాచరణ చేయాలన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారులు పునః పరిశీలన చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథక లబ్ధిదారులకు ఏడాదికి రూ.12 వేలను రెండు విడతలుగా ప్రభుత్వం అందిస్తుందన్నారు.
ఈజీఎస్ జాబ్‌కార్డుపై ఏడాదిలో కనీసం 20 రోజులు పని చేసిన భూమి లేని నిరుపేదలు ఈ పథకానికి అర్హులన్నారు. అలాగే, కొత్త రేషన్‌కార్డులకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల సర్వే ముగింపు దశకు చేరిందన్నారు. సర్వే సమయంలో ఒక గ్రామంలో ఉన్న లబ్ధిదారుడికి భూమి ఏ గ్రామంలో ఉంటే ఆయా గ్రామంలోనే మంజూరు పత్రాలు ఇవ్వాలన్నారు. డీఆర్డీవో సన్యాసయ్య, డీపీవో ఆశాలత, డీసీఎస్వో చందన్‌కుమార్, డీఏవో పుల్లయ్య, హౌజింగ్ పీడీ శ్రీనివాస్, అదనపు డీఆర్డీవో నూరొద్దీన్, డీఎల్పీవో రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.