ఖమ్మం అర్బన్, జూలై 24: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా పేర్కొన్నారు. అందుకని టీచర్లందరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ క్రమంలో డీఈవోలు, ఎంఈవోలు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లాలో గురువారం పర్యటించిన ఆమె.. తొలుత ఖమ్మం ఎన్ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలను, కారేపల్లి ఆదర్శ పాఠశాలను, జూనియర్ కళాశాలను, ఖమ్మం డైట్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్ఎస్సీ కాలనీ స్కూల్లో కృత్రిమ మేధ (ఏఐ)పై ఏర్పాటుచేసిన ఏఐఎక్స్ఎల్ ల్యాబ్‌ను, 4వ తరగతిలో విద్యాబోధనను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఏఐ కంప్యూటర్ ల్యాబ్‌లో వారికి ఏం నచ్చిందో, కంప్యూటర్ పాఠాల అనుభవం ఎలా ఉందో అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
డైట్ నిర్మాణ పనులను పర్యవేక్షించాలి
డైట్ కళాశాల భవన నిర్మాణ, ఆధునికీకరణ, అదనపు సదుపాయాల పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా ఆదేశించారు. పనుల్లో నాణ్యతను పరిశీలించిన తర్వాతే పూర్తిస్థాయి బిల్లులు చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు. అవసరమైన ఫర్నీచర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారుచేయాలని, నిర్మాణ పనులను రెండు నెలల్లో ముగించి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. డైట్ కళాశాల పనులను అదనపు కలెక్టర్ రెగ్యులర్‌గా మానిటర్ చేయాలని సూచించారు.
సెప్టెంబర్ నుంచే టెన్త్‌కి ప్రత్యేక తరగతులు..
ఉన్నత పాఠశాలల్లో టెన్త్ ఫలితాలను సబ్జెక్టుల వారీగా రివ్యూ చేయాలని, వచ్చే సంవత్సరం ఉన్నతమైన ఫలితాల సాధనకు కృషిచేయాలని, సెప్టెంబర్ నుంచే టెన్త్‌కి ప్రత్యేక తరగతులు ప్రారంభించాలని యోగితారాణా సూచించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల డీఈవోలు, విద్యాశాఖాధికారులతో ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్‌తో కలిసి యోగితారాణా మాట్లాడారు. యూడీఐఎస్‌సీ పోర్టల్‌లో పాఠశాలల వివరాల నమోదు, ఎఫ్ఆర్ఎస్ హాజరు, విద్యార్థులకు అపార్ జనరేషన్ వంటివి వందశాతం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో కిటికీల వద్ద తప్పనిసరిగా మెష్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్బీఎస్కే బృందాలు రెగ్యులర్‌గా విద్యార్థుల హెల్త్ చెకప్ చేయాలన్నారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని, నాన్ వెజ్ వండే సమయంలో నాణ్యతను ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని సూచించారు. డీఈవో, ఎంఈవోలు స్కూళ్లను తనిఖీ చేసే సమయంలో ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని కూడా గమనించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్రీజ, టీజీఆర్‌ఈఐఎస్ కార్యదర్శి రమణకుమార్, అడిషనల్ డైరెక్టర్ రాజీవ్, భద్రాద్రి ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, జేడీ సర్వీసెస్ మదన్మోహన్, ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, సమగ్రశిక్ష జేడీ వెంకటనర్సమ్మ, హరీష్, మంజరి, సురేశ్, పాఠక్, షఫీమియా, సత్యనారాయణ, డీఈవోలు, ఎంఈవోలు, హెచ్ఎంలు, అడల్ట్ ఎడ్యుకేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఓపెన్ స్కూళ్లలో టెన్త్, ఇంటర్ ప్రవేశాల కోసం రూపొందించిన షెడ్యూల్ పోస్టర్లను యోగితారాణా ఆవిష్కరించారు.
కారేపల్లి మోడల్ స్కూల్ తనిఖీ..
కారేపల్లి, జూలై 24: కారేపల్లి మోడల్ సూల్ను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా గురువారం సందర్శించారు. తరగతి గదులు, ల్యాబ్‌లు, గ్రంథాలయం, వంట గదులను తనిఖీ చేశారు. విద్యార్థుల కంప్యూటర్ నాలెడ్జిని పరీక్షించారు. సూల్లో అవసరాలను గుర్తించి వెంటనే సమకూర్చాలని ప్రిన్సిపాల్ ప్రేమ్‌కుమార్‌ను, అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంచే మరిన్ని పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీఎంశ్రీ సూల్ పథకం కింద మోడల్ సూళ్లలో గ్రంథాలయాలు అభివృద్ధి చేయాలని సూచించారు.