మామిళ్లగూడెం, ఆగస్టు 17 : 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటరు హక్కు కల్పిస్తూ పకడ్బందీగా ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన.. అదనపు సీఈవో లోకేష్‌కుమార్‌తో కలిసి హైదరాబాద్ సీఈవో కార్యాలయం నుంచి ఓటరు జాబితా సవరణ-2025పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ డి.మధుసూదన్‌నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ జనవరి 1, 2025 ప్రామాణికంగా ఓటరు జాబితా సవరణ చేయాలని సూచించారు. ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 28 వరకు ఫ్రీ రివిజన్ నిర్వహించి.. అక్టోబర్ 29న ముసాయిదా ప్రకటించాలన్నారు. నవంబర్ 28 వరకు జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి.. డిసెంబర్ 24 వరకు పరిష్కరించి.. 2025, జనవరి 6న జాబితా ప్రకటించాలని తెలిపారు. 2025, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతీ ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం కార్యాచరణ చేసి ఓటరు జాబితా సవరణ పూర్తి చేస్తామన్నారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖాళీగా ఉన్న అదనపు కలెక్టర్, వైరా ఆర్వో, నేలకొండపల్లి తహసీల్దార్, ఈఆర్వో ఖాళీల విషయంపై సీఈవోకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం డీఈ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.