ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా కస్తూర్బా పాఠశాలల్లో చదువులు స్తంభించాయి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) బోధన, బోధనేతర సిబ్బంది చేస్తున్న సమ్మె కొనసాగుతూనే ఉంది. దీంతో పక్షం రోజులకు పైనే విద్యార్థినులు చదువులకు దూరమయ్యారు. వార్షిక పరీక్షలు దగ్గరపడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ వాటిని వద్దని.. తమ ఉపాధ్యాయులే తమకు కావాలని విద్యార్థినులు కోరుతున్నారు. లక్షల్లో జీతాలు తీసుకునే ఉపాధ్యాయుల కంటే ఎక్కువ గంటలు పనిచేస్తూ, చాలీచాలని జీతాలతో నైట్ డ్యూటీలు, స్టడీ అవర్స్, ఆడిట్లు, టెండర్లు, హాస్టళ్ల నిర్వహణ, 24 గంటలూ విద్యార్థినుల పర్యవేక్షణతో కేజీబీవీల్లో పనిచేసే క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు, ఎస్ఎస్ఏ ఉద్యోగులు రెగ్యులర్ వాళ్ల కంటే ఎక్కువ కష్టపడుతున్నా వారిలో నాలుగోవంతు కూడా జీతాలు తీసుకోలేకపోతున్నారు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం చేస్తుండడంతో విద్యార్థినుల భవిష్యత్తుపై ప్రభావం పడనున్నది.
– కూసుమంచి, డిసెంబర్ 21
పాఠశాల మానేసిన విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన కేజీబీవీల్లో ఒకప్పుడు తరగతుల్లో ఖాళీలు ఉండేవి.. కానీ.. నేడు ఉన్న సీట్ల కంటే మూడు, నాలుగు రెట్లు దరఖాస్తులు రావడం అక్కడి విద్యాబోధన, నిర్వహణకు నిదర్శనం. ప్రత్యేకంగా పేదరికంలో ఉన్న విద్యార్థినులు, తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రాధాన్యతను ఇస్తూ ఎలాంటి ఎంట్రన్స్ లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలల్లో మంచి గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్లకు పోటీగా ఫలితాలు రావడం విశేషం. కేజీబీవీల్లో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు కూడా తక్కువగా ఉన్నాయి..
తమ జీతాలు పెంచాలనే ప్రధాన డిమాండ్లతోపాటు మరికొన్ని సమస్యలతో ఈ నెల 6 నుంచి ఆందోళనబాట పట్టారు. 17 రోజులుగా పాఠశాలల్లో బోధన బంద్ పెట్టి ఆందోళనకు దిగారు. ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న సిబ్బంది, కేజీబీవీల ఉపాధ్యాయినుల పరిస్థితి జీతాల విషయంలో ఘోరంగా ఉంది. ప్రభుత్వం వచ్చాక జీతాలు పెంచుతామన్న హామీ నెరవేర్చాలని సమ్మెలో పాల్గొన్న వారు కోరుతున్నారు. కూసుమంచి మండలంలో కస్తూర్బా గురుకుల పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది చేస్తున్న నేపథ్యంలో డీఈవో సోమశేఖర శర్మ ఆదేశాల మేరకు ఎంఈవో వీరస్వామి ప్రతిరోజు పాఠశాలను సందర్శిస్తూ.. విద్యార్థినుల చదువులకు ఆటంకం కలగకుండా చూస్తున్నారు.
మా టీచర్లు మాకే కావాలి..
ఉపాధ్యాయులు లేని కారణంగా చదువులు కుంటుపడుతుండడంతో విద్యాశాఖ అధికారులు ఇతర పాఠశాలల్లో పనిచేసే బోధనా సిబ్బందిని ఇక్కడికి పంపిస్తున్నప్పటికీ విద్యార్థినులు మాత్రం తమ టీచర్లు తమకే కావాలంటూ పట్టుబడుతున్నారు. కూసుమంచి మండలం గట్టుసింగారం కేజీబీవీలో విద్యార్థునులు భోజన విరామ సమయంలో ప్లకార్డులు ప్రదర్శించి కొద్దిసేపు ఆందోళన చేశారు. టెన్త్, ఇంటర్ పరీక్షలకు సమయం దగ్గరపడడంతోపాటు జనవరిలో సంక్రాంతి సెలవులు రావడంతో సెలవులు పోను.. ఇంకా మరో 50 రోజులే పరీక్షలకు సమయం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేజీబీవీల్లో సుమారు వెయ్యి మంది వరకు టెన్త్ విద్యార్థినులు, 15 వందల మంది వరకు వివిధ గ్రూపుల్లో ఇంటర్ విద్యార్థినులు చదువుతున్నారు.
కేజీబీవీల వివరాలు
ఖమ్మం జిల్లాలో 14, భద్రాద్రి కొత్తగూడెంలో 14 పాఠశాలలు
ఖమ్మంలో 360, భద్రాద్రిలో 335 మంది బోధన, బోధనేతర సిబ్బంది
ఖమ్మంలో 4,500 మంది, భద్రాద్రిలో 3,702 మంది విద్యార్థినులు
పని ఎక్కువ.. జీతాలు తక్కువ..
రోజువారీ ఇతర పాఠశాలల్లో ఉపాధ్యాయులు చేసే పనికంటే రెట్టింపు పని చేస్తున్నాం.. కానీ.. జీతాలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. మా న్యాయమైన కోర్కెలకు ప్రభుత్వం స్పందించాలి. సీఎం రేవంత్రెడ్డి పెద్ద మనసుతో ఆలోచించి మాకు న్యాయం చేయాలి. జీతాల పెంపు కోసం 17 రోజులుగా సమ్మె చేస్తున్న మమల్ని అర్థం చేసుకోవాలి.
-అజితకుమారి, ఎస్వో, కూసుమంచి
మాకిచ్చిన హామీలు నెరవేర్చాలి..
చాలా తక్కువ జీతాలతో పనిచేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నాం. సర్వశిక్షా ఉద్యోగులు న్యాయమైన కోర్కెల కోసం చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం స్పందించాలి. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి తగిన న్యాయం చేయాలి. ఇందులో వివక్ష తగదు.
– ఝాన్సీసౌజన్య, ఎస్వో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మా టీచర్లు మాకే కావాలి..
సెలవులు పోను పరీక్షలకు ఇంకా 50 రోజులే ఉన్నాయి. సిలబస్ అయిపోయినా రివిజన్ అవసరం కనుక మా టీచర్ల సమస్యలు తీర్చి మాకు పంపాలి. గురుకులంలాగానే మా పాఠశాల కూడా ఉంది. చదువుతోపాటు అన్ని వసతులు ఉన్నాయి. కానీ.. గత 17 రోజులుగా సమ్మెతో మా చదువులు కష్టమవుతున్నాయి. సమ్మె విరమించేలా చూడాలని కోరుతున్నాం.
– పీ.శృతి, టెన్త్ విద్యార్థిని, కేజీబీవీ కూసుమంచి
తక్షణమే విధులకు హాజరుకండి..
కేజీబీవీల్లో విద్యాబోధన చాలా బాగుంటుంది అంటే.. అది సిబ్బంది కృషే. పరీక్షలు దగ్గర పడుతున్నందున విద్యార్థినులకు ఇబ్బంది కలుగకుండా సమ్మె విరమించి విధులకు హాజరు కావాలి. ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఇచ్చారు. వాటిని పరిగణనలోకి తీసుకొని విధుల్లో చేయాలి. క్రిస్మస్, సంక్రాంతి సెలవులు రావడంతో విద్యార్థినులకు మరింత బోధన దూరం అవుతుంది. సమ్మె చేస్తున్న వారి కోర్కెలు, విద్యార్థులకు మంచి పరీక్షల సమయంలో ఇబ్బంది కలుగుతుందని గుర్తించాలి.
– అజిత, జీసీడీవో