భద్రాచలం/అశ్వారావుపేట రూరల్, మే 28 : విద్యార్థినులు ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ అన్నారు. భీమునిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదివి 10 జీపీఏ సాధించిన ఉట్లపల్లి గ్రామానికి చెందిన కొవ్వాసి జ్యోతిచందును పీవో తన కార్యాలయంలో మంగళవారం అభినందించి ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదివి ఫలితాల్లో 10 జీపీఏ సాధించడం మంచి పరిణామమన్నారు. అత్యుత్తమ ర్యాంక్ సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తేవడం పట్ల ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థినీ విద్యార్థులు జ్యోతిచందును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భీమునిగూడెం ఆశ్రమ పాఠశాల హెచ్ఎం పద్మ పాల్గొన్నారు.