తరగతి గదిలో ఉండాల్సిన విద్యార్థులు రోజంతా పత్తి చేను, చెట్లపై ఆటలాడుతూ కనిపించారు. వివరాల్లోకెళ్తే.. దుమ్ముగూడెం మండలం ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామమైన లింగాపురం పాఠశాల ఏకో ఉపాధ్యాయ పాఠశాల. ఇక్కడ రెగ్యులర్ ఉపాధ్యాయుడు సెలవులో ఉండడంతో ప్రత్యామ్నాయంగా మరో టీచర్ విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో టీచర్ తన సొంత పనులపై బడిని వదిలివెళ్లిపోయాడు.
దీంతో విద్యార్థులు పాఠశాల చుట్టుపక్కల ప్రాంతాలు, పత్తి చేనులో ఆడుకున్నారు. అయితే పిల్లలకు ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఏటీడబ్ల్యూ నరసింహారావును వివరణ కోరగా పూర్తి విచారణ చేసి ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.