ఖమ్మం, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చైతన్యవంతమైన జిల్లా అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఖమ్మం జిల్లానే. ఎడ్యుకేషన్ హబ్‌గా కూడా జిల్లా పేరుగాంచింది. జిల్లాలో అనేకమంది మేధావులు, విద్యావేత్తలు పరిపుష్టంగా ఉన్నప్పటికీ జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన పాపానపోలేదు. ఇటీవల నియమించిన కాకతీయ యూనివర్సిటీ పాలకమండలిలో జిల్లా నుంచి ఒకరిద్దరికి కూడా చోటు కల్పించదు. ‘ఖమ్మం జిల్లా కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనే ఉందా? జిల్లాలో మేధావులు, అర్హులే లేరా? ముగ్గురు కీలక మంత్రులు ఉండి కూడా జిల్లాకు ప్రాతినిథ్యం లేకపోవడం ఏమిటి?’ అంటూ మేధావులు, విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అనుబంధ గుర్తింపు ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు అత్యధికంగా ఉమ్మడి ఖమ్మంజిల్లాలోనే ఉన్నాయి. యూనివర్సిటీకి అందించే రెవెన్యూ కూడా జిల్లా నుంచే అధిక మొత్తంలో వెళ్తోంది. కేయూ పరిధిలో 410 డిగ్రీ, 80 పీజీ కళాశాలలుండగా వీటిలో 21 పీజీ కళాశాలలు, 114 డిగ్రీ కళాశాలలు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోనే ఉన్నాయి. గతంలో నియమించిన ప్రతి పాలకమండలిలోనూ ఖమ్మం జిల్లాకు ప్రాతినిథ్యం ఉంది. గత ఐదు, ఆరు పాలకమండళ్లలో సత్తుపల్లికి చెందిన కొత్తురు ప్రభాకర్‌రావు, తర్వాత బీఈడీ కళాశాలకు చెందిన డాక్టర్ మువ్వా శ్రీనివాసరావు, కవిత విద్యాసంస్థలకు చెందిన కోటా అప్పిరెడ్డి, గత ప్రభుత్వం నియమించిన పాలకమండలిలో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు డాక్టర్ రావూరి సీతారామారావు సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఎడ్యుకేషనలిస్ట్ కోటా, ఇనిస్టిట్యూషన్స్ కోటా, లెక్చరర్స్ కోటా కింద సభ్యులుగా నియామకమయ్యారు.
జిల్లాలో ముగ్గురు పవర్ఫుల్ మంత్రులుండి కూడా జిల్లాకు ప్రాతినిథ్యం లేదు. కేయూ ఈసీలో ఎంపికైన వాళ్లంతా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే. ఖమ్మం జిల్లాకు కనీస ప్రాతినిథ్యం కూడా లేదు. యూనివర్సిటీ వివాదాలకు నిలయంగా మారింది. సరైన పాలకమండలి లేకపోతే సమస్యలతో మరింత భ్రష్టుపట్టిపోయే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాకు ప్రాతినిథ్యం ఇవ్వకపోవడం దుర్మార్గం.. ప్రైవేట్ విద్యాసంస్థలను పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణం. ఒక యూనివర్సిటీ పాలకమండలిలో అత్యధిక కళాశాలలున్నప్పటికీ జిల్లాకు కనీసం ప్రాతినిథ్యం లేకపోవడం, కనీస గుర్తింపు ఇవ్వకపోవడం శోచనీయం. అర్హతలేని వారిని సభ్యులుగా నియమించి పాలకమండలి ఏర్పాటు చేశారు.’ అంటూ గ్రాడ్యుయేట్ సంఘాల నేలు, విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు భట్టి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించి పాలకమండలిని రద్దు చేసి ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం దక్కేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
కాకతీయ యూనివర్సిటీ పాలకమండలిలో 9 మంది సభ్యులు ఉంటారు. యూనివర్సిటీలో నుంచి ఇద్దరిని, లెక్చరర్స్‌లో నుంచి ఇద్దరిని, ప్రిన్సిపాల్స్ కేటగిరీ నుంచి ఇద్దరిని, ఎమినెంట్ పర్సనాలిటీ నుంచి నలుగురిని పాలకమండలిలో ఎంపిక చేయాలి. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ కలిగిన కళాశాల. న్యాక్ ఏప్లస్ప్లస్ వచ్చిన ఏకైక కళాశాల. ప్రిన్సిపాల్‌ని లేదా లెక్చరర్ని ఏదో ఒక కేటగిరీలో ఎంపిక చేయాలి. కానీ కళాశాలకు ప్రాతినిథ్యం కల్పించలేదు. పాలకమండలిలో తప్పనిసరిగా ఇండస్ట్రియలిస్ట్, ఎడ్యుకేషనలిస్ట్ కోటాల నుంచి జిల్లాలో ఎవరో ఒకరిని మొదటి నుంచి నియమిస్తున్నారు.