Khammam | ఖమ్మం రూరల్:పశువుల అక్రమ రవాణా నియంత్రణకు సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) ప్రసాదరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశువుల అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు వెంకటగిరి క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ని సోమవారం సందర్శించిన అడిషనల్ డీసీపీ పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ.. అక్రమ రవాణా నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులలో 24×7 నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. పశువులను రవాణాచేసే ప్రతి వాహనానికి తగు నిర్ధారిత ప్రమాణిక పత్రాలు (వాలిడ్ డాక్యుమెంట్స్) నియమ, నిబంధనలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, సరైన పత్రాలు వారి వెంట ఉన్నాయనే విషయాన్ని పరిశీలించి అనుమతించాలని సిబ్బందికి సూచించారు. ఎవరైనా అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే వారి వాహనాలు సీజ్ చేస్తారని అన్నారు. ప్రధానంగా పశువుల అక్రమ రవాణాను పోలీసులు మినహా ఏ సంస్థలు-కార్యకర్తలు వాహనాలను స్వయంగా అడ్డుకుంటే ఉపేక్షించేది లేదని, నిబంధనలు విరుద్ధంగా అక్రమ రవాణా జరిగితే స్దానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
చట్టాన్ని ఏవరు కూడా తమ చేతుల్లోకి తీసుకొని శాంతిభద్రతలకు విఘాతం కల్పించే పరిస్థితులు తీసుకొనిరావద్దన్నారు. ఏదైనా సమస్య ఉంటే పరిష్కారానికి పోలీస్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. ఎవరైనా చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. సరిహద్దు చెక్ పోస్టుల తనిఖీలే కాకుండా జిల్లా కేంద్రంలో సైతం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కారించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా, మత సామరస్యంతో జరుపుకునేలా అవసరమైన చోట్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం రూరల్ సీఐ ఎం రాజు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.