కరకగూడెం, జూన్ 23: మండలంలోని చిరుమళ్ల వంతెన మరమ్మతుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ జితేష్ వీ పాటిల్ తెలిపారు. గతేడాది వానకాలంలో చిరుమళ్ల వంతెన వరద తాకిడికి కొట్టుకుపోయింది. దీంతో కరకగూడెం- చిరుమళ్ల మధ్య రాకపోకలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈక్రమంలో ఆదివారం కలెక్టర్ చిరుమళ్ల వంతెనను అధికారులతో కలిసి పరిశీలించారు. మొదటిసారి మండలానికి వచ్చిన కలెక్టర్కు అధికారులు ఘనస్వాగతం పలికారు. వంతెన మరమ్మతుల ఆలస్యానికి గల కారణాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వంతెన నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగప్రసాద్, పలు పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.