కారేపల్లి, సెప్టెంబర్ 07 : కారేపల్లి మండలంలోని శాంతినగర్ గ్రామంలో గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన (బొడ్రాయి) వేడుకలు ఈ నెల 5 నుండి సోమవారం వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు యాగశాల అలంకరణ, నాలుగు దిక్కుల తోరణాలు నిర్మాణం, జ్యోతి ప్రజ్వలన, విగ్నేశ్వర పుణ్యాహవాచనం ప్రసాదాలు కర్పూర హారతి పూజా కార్యక్రమాలు జరిపారు. రెండవ రోజు సుప్రభాత సేవ, నిత్య పూజ కార్యక్రమాలు, నిత్య అగ్ని హోమాలు, క్షీరాదివాసం, జలాదిస్నానాలు, మంగళహారతి ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. గ్రామ ఆడపడుచులకు అమ్మవారి బోనాలు సమర్పించుట, నైవేద్యం, ముడుపులు తదితర ప్రత్యేక పూజలు చేశారు.
మూడవరోజు బొడ్రాయి (గ్రామ దేవతల) ఉదయం వేద పండితులచే మంత్రోచ్ఛరణాల నడుమ ప్రతిష్టాపించారు. గ్రామ పెద్దల సమక్షంలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అగ్నిప్రతిష్టాపన, హోమం, బొడ్రాయి, ఊరేగింపు, అభిషేకం తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతితో ఊరేగిపుగా వెళ్లి గ్రామంలో ప్రతిష్టాపన చేసిన బొడ్రాయి దేవతమూర్తులకు నైవైద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

శాంతినగర్లో వైభవంగా గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠ