పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి మూడోసారి సీఎం కావడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల సంస్మరణ కార్యక్రమం గురువారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొలుత మేయర్ అమరుల సంస్మరణ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ్యులందరూ ఏకగ్రీవంగా బలపరిచారు. సమావేశంలో మంత్రి పువ్వాడతోపాటు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, కలెక్టర్ గౌతమ్ పాల్గొని ప్రసంగించారు.
ఖమ్మం, జూన్ 22: పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి మూడోసారి సీఎం కావడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొలుత మేయర్ అమరుల సంస్మరణ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ్యులందరూ ఏకగ్రీవంగా బలపరిచారు. అమరుల ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారు చేసిన త్యాగం ప్రజల గుండెల్లో పదిలంగా ఉందన్నారు. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన ఉద్యమనేత కేసీఆర్ సరార్ వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నదన్నారు. అమరుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో కూడిన ఉద్యమ ట్యాగ్ లైన్‌ను పరిపూర్ణం చేస్తూ పాలన సాగుతుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఉత్సవాల చివరి రోజు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో, వాడవాడలా అమరులకు ఘనంగా నివాళులర్పించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నదన్నారు.
తెలంగాణ వస్తే అంధకారమని, నక్సలిజం బలపడుతున్నదని, అన్ని రంగాల్లో వెనుకబడిపోతుందన్న వారి అంచనాలను తలకిందులు చేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్నామని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగినట్లు తెలిపారు. సమైక్యాంధ్రలో అన్ని రంగాల్లో వెనుకబడ్డ తెలంగాణ, రాష్ట్ర ఏర్పాటుతో అనతికాలంలోనే అన్ని రంగాల్లో ఊహించని అభివృద్ధితో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా మారిందన్నారు. కోతల్లేని 24 గంటల విద్యుత్, దేశానికే ధాన్య భాండాగారంగా మారిందన్నారు. అమరుల ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో పాలన సాగుతున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఈనెల 2వ తేదీ నుంచి ఘనంగా జరుపుకున్నామని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కో శాఖలో సాధించిన ప్రగతి, అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తున్నట్లు పేర్కొన్నారు. అహింసాయుతంగా రాష్ట్ర సాధనకు అన్ని వర్గాల వారు ఉద్యమం చేశారన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒకరూ పునరంకితులై రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలన్నారు. అనంతరం దశాబ్ది ఉత్సవాల ప్రగతి నివేదికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, పలువురు కార్పొరేటర్లు, ఉద్యమకారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.