‘కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది.. వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది.. రూ.6 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నది.. వారింట్లో వివాహాలకు రూ.30 వేలు కానుక ఇస్తున్నది.. కార్మికులంతా సంఘటితమయ్యేందుకు ఖమ్మం నగరంలోని త్రీటౌన్‌లో రూ.కోటి ప్రభుత్వ నిధులతో కార్మిక భవనం నిర్మిస్తాం.. రూ.10 కోట్లతో వ్యవసాయ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తాం.. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం.. పింఛన్లు, ఇండ్లు, దళితబంధు పథకంలో కార్మికులకు మొదటి ప్రాధాన్యం ఇస్తాం.. కార్మికులు, కర్షకుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారు..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మే డే సందర్భంగా సోమవారం ఖమ్మం ఏఎంసీ ఆవరణలోని బీఆర్ఎస్కేవీ సంఘం కార్యాలయం ఎదుట సంఘ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వేలాది మంది ఏఎంసీ ట్రాలీ అసోసియేషన్, మార్కెట్ కార్మికులతో కలిసి వాహన ర్యాలీలో పాల్గొన్నారు. ప్రదర్శనతో నగరం గులాబీమయమైంది.
– ఖమ్మం / ఖమ్మం వ్యవసాయం, మే 1
ఖమ్మం/ ఖమ్మం వ్యవసాయం, మే 1: ఖమ్మం నగరంలోని త్రీటౌన్‌లో రూ.కోటి ప్రభుత్వ నిధులతో కార్మిక భవనం నిర్మిస్తామని, రూ.10 కోట్లతో ఖమ్మం ఏఎంసీని అభివృద్ధి చేస్తామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మే డే సందర్భగా సోమవారం ఖమ్మం ఏఎంసీ ఆవరణలోని బీఆర్ఎస్కేవీ సంఘం కార్యాలయంతో పాటు పలుచోట్ల కార్మిక జెండాలను ఆవిష్కరించారు. అనంతరం వేలాది మంది ఏఎంసీ ట్రాలీ అసోసియేషన్, మార్కెట్ కార్మికులతో కలిసి ర్యాలీగా ఖమ్మం ఏంఎసీ నుంచి గాంధీచౌక్, కాల్వొడ్డు, జడ్పీ సెంటర్, చర్చి కాంపౌండ్, బోస్ బొమ్మ సెంటర్ మీదుగా తిరిగి ఏఎంసీకి చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కార్మికులు, కర్షకుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు.
కార్మికులకు వివిధ రూపాల్లో ఉపాధినిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. రూ.6 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నామన్నారు. కార్మికుల ఇంట్లో పెండ్లికి రూ.30 వేలు అందిస్తున్నామన్నారు. ఖమ్మానికి ఈఎస్ఐ ఆసుపత్రిని తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం కార్మికులకు అందజేసిన హెల్త్‌కార్డులతో మమత వైదశాలలో ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్స అందజేస్తున్నామన్నారు. కార్మికులు సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజెప్పాలన్నారు. తొలుత మంత్రి 3 వేల మంది ఏఎంసీ కార్మికులకు యూనిఫాం అందజేశారు.
ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, వర్తక సంఘం బాధ్యులు కూరాకుల నాగభూషణం, పునుకొల్లు నీరజ, దోరేపల్లి శ్వేత, షేక్ అఫ్జల్, బచ్చు విజయ్‌కుమార్, పాల్వంచ కృష్ణ, పాషా, పగడాల నాగరాజు, నున్నా మాధవరావు, చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలం, బుర్రి వినయ్‌కుమార్, ఆర్జేసీ కృష్ణ, తాజుద్దీన్, లింగాల రవికుమార్, తోట రామారావు, మోటె కుమార్, సైదులు, రామిరెడ్డి, ఆవుల శ్రీను, సాదె శంకర్, కొత్తా సైదిరెడ్డి, కనకం భద్రయ్య, మరాటి యాదయ్య, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు..
ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేడే వేడుకల్లో పాల్గొని కార్మిక జెండాలను ఎగురవేశారు. ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మధిరలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి జిల్లాలో..
భద్రాద్రి కొత్తగూడెం, మే 1 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ మేడే వేడుకలు జరిగాయి. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సింగరేణి కార్మికుడి వేషధారణలో కన్పించారు. ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ మేడే వేడుకల్లో పాల్గొన్నారు. కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొని ముందు నడిచారు.