పినపాక, నవంబర్ 10: మూడు రోజులపాటు ఉత్సాహభరిత వాతావరణంలో ఈ బయ్యారం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-17 బాలబాలికల కబడ్డీ పోటీలు సోమవారం ముగిశాయి. హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో బాలికల విభాగంలో నల్లగొండ జట్టుపై ఖమ్మం, బాలుర విభాగంలో ఖమ్మంపై హైదరాబాద్ జట్టు గెలుపొందాయి. ముగిం పు కార్యక్రమంలో విజేతలకు భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బహుమతులు అందజేశారు.
అనంతరం క్రీడాకారులనుద్దేశించి మాట్లాడుతూ క్రీడల్లో ఓడినంత మాత్రాన కుంగిపోకుండా మళ్లీ గెలిచేందుకు మెళకువలు నేర్చుకోవడంతోపాటు నిరంతరం సాధన చేయాలని సూచించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలని, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి రాష్ర్టానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. చిన్నతనం నుంచే ఆటలపై మక్కువ పెంచుకుంటే ఉన్నతస్థాయికి ఎదగవచ్చన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీవో సంకీర్తు, ఎంపీవో వెంకటేశ్వరరావు, ఎంఈవో నాగయ్య, క్రీడల కార్యదర్శి వీరన్న, కంది చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కంది సుబ్బారెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.