ముల్లోకాలను ఏలే జగదభిరాముడు సీతాలక్ష్మణ హనుమంతుని సమేతుడై జల విహారం చేశాడు.. అలల ఊయలపై సేద తీరాడు.. వేద మంత్రోచ్ఛారణ, మంగళవాద్యాల నడుము, దీప కాంతుల నడుమ స్వామివారి విహారం సాగింది.. రామయ్యను వీక్షించి భక్తులు తరించారు.. గౌతమీ తీరం జనసంద్రమై పావనమైంది.. విహారం తర్వాత అర్చకులు ఉత్సవమూర్తులను అంతరాలయానికి తీసుకొచ్చి మహా నివేదన, పవళింపు సేవ నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సోమవారం స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
– భద్రాచలం, జనవరి 1
భద్రాచలం, జనవరి 1 : జగములను ఏలిన జగదభిరాముడు సీతా సమేతుడై గోదావరిలో హంస వాహనంపై నేత్రపర్వంగా జల విహారం చేశాడు. ఈ వేడుకను కనులారా గాంచిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. ముక్కోటి ఉత్సవాల్లో ప్రధానమైన ‘తెప్పోత్సవం’ అంగరంగ వైభవంగా సాగింది. విద్యుత్ దీపాలంకృతమైన లాంచీలో కనులు మిరుమిట్లు గొలిపే బాణాసంచా నడుమ రామయ్య ఐదుమార్లు గోదావరిలో జలవిహారం చేశారు. సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారికి కనుల పండువగా ఘట్టాన్ని నిర్వహించారు.
ఆదివారం నిత్య పూజల అనంతరం సాయంత్రం 4గంటలకు సకల రాజలాంఛనాలతో, మేళతాళాలు, మంగళవాయిథ్యాలు, వేద మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పల్లకిలో గోదావరి తీరంలో సర్వాలంకరణ శోభితమైన హంసవాహనం వద్దకు తీసుకొని వచ్చి ప్రత్యేక వేదికపై స్వామివారిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గోదావరి మాతకు పూజ చేసి, పసుపు, గంథం, కుంకుమ, గాజులు, పట్టుచీరె, జాకెట్‌ను, కర్పూరం, అగరవత్తులు, జల పుష్పాలకు మరమరాలు సమర్పించారు. 6.01గంటలకు హంస వాహనం జల విహారానికి బయలు దేరింది. ఆ సుందర, సుమథుర, కమనీయ, రమణీయ దృశ్యాన్ని కనులారా దర్శించవలసిందే. గోదావరి అలలపై హంస వాహనం తేలి ఆడింది.
ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు వేలాదిగా భక్తులు గోదావరి తీరం వద్దకు రావడంతో గోదావరి తీరం జనసంద్రంగా మారింది. జల విహారం పూర్తయిన తరువాత రామయ్యను అంతరాలయానికి తీసుకొని వచ్చి మహా, నివేదన, పవళింపు సేవ జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం ఆర్డీఓ రత్న కళ్యాణి, భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌రాజ్, మణుగూరు డీఎప్సీ రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు ఉత్తర ద్వార దర్శనం
భద్రాద్రి దివ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా సోమవారం తెల్లవారుజామున భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆదివారం అర్థరాత్రి 12గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, సేవాకాలం, ఆరగింపు తదితర నిత్యపూజలు జరుపుతారు. భక్త రామదాసు కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున 3గంటలకు మూలవరులకు నిర్వహించే ప్రత్యేక అభిషేకంలో స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ దంపతులు పాల్గొంటారు.
అనంతరం స్వామివారికి దివ్యాభరణాలు అలంకరించి, ఉత్తర ద్వారం వద్ద ఆసీనులను చేస్తారు. 5గంటలకు ధూప, దీఫముల నడుమ ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు డిసెంబర్ 23న ప్రారంభం కాగా తొలి పది రోజుల పాటు పగల్ పత్తు ఉత్సవాలు నిర్వహించారు. పగల్ పత్తు ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం తిరుమంగైళ్వార్ పరమ పదోత్సవం, వేద పఠనం వైభవంగా జరిపారు.