“హలో.. అన్నా నేను ….. ఈసారి మన ఊరి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను.. మీరూ పెదనాన్న, పెద్దమ్మ, వదిన తప్పకుండా పోలింగ్ రోజు మన ఊరికి రావాలి.. నాకు ఓటేసి గెలిపించాలి ప్లీజ్.. మన గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకే సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాను.. మన ఊరు బాగు కోసం కచ్చితంగా కుటుంబంతో సహా వచ్చి ఓటు వేసి నాకు మద్దతు ఇవ్వాలి.. అవసరమైతే రానుపోను రవాణా చార్జీలు నేను భరిస్తాను..” ఇవి పల్లెల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాటలు.. సర్పంచ్‌గా పోటీచేస్తున్న అభ్యర్థులు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు ఫోన్లు చేసి మరీ వేడుకుంటున్నారు.
– అశ్వారావుపేట, డిసెంబర్ 6
ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లిన గ్రామీణ ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులను సైతం క్రియేట్ చేసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక ఓటర్లను కలుసుకుంటూనే ఇతర ప్రాంతాల్లో ఉపాధి కోసం స్థిరపడిన గ్రామీణ ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఇందులో భాగంగానే పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు ఫోన్లు చేసి పలకరిస్తున్నారు.
ఆప్యాయంగా పలకరిస్తూ ప్రేమ ఒలకబోస్తున్నారు. యోగక్షేమాలు అడుగుతూ బంధుత్వాలు, పరిచయాలను గుర్తు చేస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థులతోపాటు వార్డులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఫోన్లు చేసి ఓట్లు వేయాలని కోరుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఓటర్లను టచ్‌లో ఉంచుకోవటానికి మద్దతుదారులు, అనుచరులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తున్నారు. పోలింగ్ రోజు గ్రామానికి రప్పించటంతోపాటు వచ్చేందుకు అయ్యే రవాణా ఖర్చులు చెల్లించేలా పురమాయిస్తున్నారు. పంచాయతీలో ఓటర్ల జాబితా ఆధారంగా స్థానిక ఓటర్లు ఏ ప్రాంతంలో ఉన్నారో గుర్తిస్తున్నారు. అదును దొరికినప్పుడల్లా ఫోన్లు చేసి రావాల్సిందిగా కోరుతున్నారు.
ఒక్క ఓటూ వదులుకోకుండా..
గ్రామ పంచాయతీ ఎన్నికలు కావటంతో తక్కువ ఓట్లు ఉన్నందున ఏ ఒక్క ఓటునూ వదులుకోకూడదనే నిర్ణయంతో అభ్యర్థులు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ర్టాల్లో ఉన్న ఓటర్లను రప్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరంతా ఉద్యోగులు, ఉపాధి కోసం వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నారు. వీరు ఎక్కడ పనిచేస్తున్నా స్వగ్రామంలో ఓటు కలిగి ఉన్నారు. ఎన్నికల సమయం లేదా పండుగలకు వచ్చి వెళ్తుంటారు.
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దూర ప్రాంత ఓటర్లకు రాజకీయ నాయకులు ప్రత్యేక వాహనాలతోపాటు రవాణా చార్జీలు చెల్లించారు. ప్రతి ఓటు గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఒక్క ఓటును కూడా వృథా చేయకూడదని ఫోన్లు చేసి పిలుస్తున్నారు. ఎన్నికలను ఆసరా చేసుకుని కుటుంబ సభ్యులను కలుసుకోవచ్చనే అభిప్రాయంలో చాలామంది పట్టణ ఓటర్లకు పోలింగ్ రోజు సొంత గ్రామాలకు రావటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో రెండు విడతల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తైంది. అభ్యర్థులు ఎన్నికల సంగ్రామంలోకి దిగి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారం కోసం ప్రత్యేక వాట్సప్ గ్రూపులను క్రియేట్ చేసుకుంటున్నారు. ప్రచారంలో ప్రత్యక్షంగా కలుసుకోలేని ఓటర్లను వాట్సప్ ద్వారా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రోజూవారీ ప్రచారాన్ని వాట్సప్ గ్రూపులో పెట్టి కలుసుకోలేని ఓటర్లకు సందేశం రూపంలో సమాచారం పంపుతున్నారు. తాను గెలిస్తే గ్రామాభివృద్ధికి ఏం చేస్తానో ప్రకటిస్తూనే తన ఫొటోలు, ఎన్నికల గుర్తులతో ఉన్న ఫొటోలను ఫార్వర్డ్ చేస్తున్నారు. గతంలో చేసిన సేవా కార్యక్రమాలు, చేయబోయే హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పల్లెల్లో పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. వారం రోజులే ప్రచార సమయం ఉండటంతో ఒక్క నిమిషం కూడా వృథా కాకుండా ప్రచారంలో నిమగ్నమై కష్టపడుతున్నారు. సర్పంచ్ అభ్యర్థులతోపాటు వార్డులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. గెలుపు ధీమాతో సంగ్రామం పోరులో పరుగులు తీస్తున్నారు. కానీ, ఎవరు గెలిచేది మాత్రం నిర్ణయించేది ఓటర్లే మరి. ఎవరికి ఓటు వేస్తారో.. ఎవరికి వెన్నుపోటు పోడుస్తారో.. లేదా ఎవరూ ఇష్టం లేకుంటే నోటాను నొక్కుతారో చూడాలి.