కారేపల్లి,జనవరి 4 : ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల పరిధిలోని ఉసిరికాయలపల్లిలో గల శ్రీ కోట మైసమ్మ తల్లి ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొలిచిన వారికి కొంగు బంగారం చేస్తుందని నమ్మకంతో.. పరిసరా ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దేవాలయ ప్రధాన అర్చకుడు కొత్తలంక కైలాస శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
భాగ్యనగర్ తండా సర్పంచ్ బానోతు హిరాలాలతోపాటు స్థానిక నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం సెలవు దినం కావటంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా మారింది. వాహన పూజలు సైతం జరిపించారు. ఈ సందర్భంగా పలువురు నూతన సంవత్సర జ్యోతిష్యాన్ని పూజారి కొత్తలంక కైలాస శర్మతో చెప్పించుకున్నారు.