భద్రాద్రి కొత్తగూడెం, జూలై 13 (నమస్తే తెలంగాణ) : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నది. ఓటర్లకు వచ్చిన అనుమానాలను అధికారులు నివృత్తి చేయలేకపోవడంతో తమ ఓట్లు పోతాయేమోనని తెగ భయపడుతున్నారు. ఉదాహరణకు.. కొత్తగూడెం సన్యాసిబస్తీలో ఉన్న ఓటు కార్మిక ప్రాంతమైన రామవరం ఓటర్ల జాబితాలోకి చేరింది. ఈ విషయం ఆ ఓటరుకు తెలియకపోవడంతో తన ఓటు పోయిందని ఆందోళనకు గురయ్యాడు. తీరా తెలిసినవారు వెతికి తన ఓటు అక్కడ ఉందని చెబితేకానీ అతనికి తెలియలేదు. కొత్తగూడెంలో ఇలాంటి ఓటర్లు 3వేలకు మందికిపైగా తమ ఓట్లు వేరే పోలింగ్ బూత్‌లో ఉండటంతో తికమకపడుతున్నారు. దీనిపై అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతో ఓటర్లు బీఎల్వోల చుట్టూ తిరుగుతున్నారు.
అద్దె ఇళ్లల్లో ఉండే ప్రజలు వారి ఓట్ల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9,96,198 ఓట్లు ఉండగా.. ఇప్పటివరకు 3,50,000 ఓటర్లను మాత్రమే బీఎల్వోలు ఆన్లైన్ చేశారు. చాలామంది ఓట్లు ఆయా పరిధిలో ఓటర్ల జాబితాలో లేకపోవడంతో ఓట్లు గల్లంతవుతాయేమో అని తెగ భయపడుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వేరే పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేశారు. దీనివల్ల ఆయా ఓటర్ల జాబితాకు సంబంధించిన ఫారాలు వేరే బూత్‌లలోకి వెళ్లడంతో జనం అక్కడికి పరుగులు తీస్తున్నారు. ఓటు లేకపోతే ప్రభుత్వ పథకాలు వర్తించవేమోనని భయంతో జనాలు బీఎల్వోల వద్దకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అధికారులు సైతం ఇలాంటి దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో మరింత భయపడుతున్నారు.
జిల్లాలో 1,104 పోలింగ్ కేంద్రాల్లో 1,104 మంది బీఎల్వోలు ఉన్నారు. కానీ, ‘సర్’ కార్యక్రమం వేగవంతంగా కొనసాగకపోవడంతో మరింత సిబ్బందిని నియమించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులు 2వేల మంది అదనపు సిబ్బందిని నియమించారు. ఈ నెల 24వ తేదీకల్లా సర్ ప్రక్రియ పూర్తి కావాలని ఎన్నికల సంఘం తేదీలను ఖరారు చేసింది. దీంతో సర్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కేవలం అంగన్వాడీ టీచర్లతోపాటు మెప్మా, పంచాయతీ సెక్రటరీలు, ఇతర శాఖలను నుంచి సిబ్బందితోపాటు విద్యార్థులను కూడా ఇందులో భాగస్వాములను చేశారు.
నేను ఉండేది కొత్తగూడెం సన్యాసిబస్తీ. నా ఓటు రామవరంలో ఉంది. నాకు ఫారం రాలేదు. అడిగితే వేరే పోలింగ్ కేంద్రం బీఎల్వో వద్ద ఉందని చెప్పారు. నాలాంటి వారు చాలామంది ఎన్కే నగర్, విద్యానగర్ కాలనీల్లో ఉన్నారు. ఓటరు ఫారాలు ఎక్కడ ఉన్నాయో కూడా బీఎల్వోలకు తెలియజేయకపోతే ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉంది.
– కొండపల్లి శ్రీధర్, సమగ్ర అభివృద్ధి వేదిక ప్రెసిడెంట్
ఎప్పటినుంచో ఓట్లు వేస్తున్నాము. నాకు, నా భార్యకు అసలు ఫారాలే రాలేదు. ఓటర్ల లిస్టులో కూడా పేర్లు లేవన్నారు. మా ఓట్లు పోయినట్లేనా. చాలా రోజుల నుంచి తిరుగుతున్నాం.. కానీ, ఎవరూ చెప్పడం లేదు. ప్రతిరోజూ మైక్‌లో చెబుతున్నారని పోలింగ్ కేంద్రానికి వెళ్తే మా పేర్లు లేవని చెప్పారు.
– మడిగల వెంకన్న, చినబండిరేవు, దుమ్ముగూడెం
ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24వ తేదీకల్లా సర్ ప్రక్రియను పూర్తి చేస్తాం. ఇందుకోసం కలెక్టర్ అదనపు సిబ్బందిని నియమించారు. ప్రతిరోజూ పర్యవేక్షణ చేస్తున్నారు. ఎవరి ఓట్లు ఎటూపోవు. ప్రతి ఒక్కరికీ ఓటు ఉంటుంది. ఓటు లేనివారికి కూడా తేదీలను ఇచ్చారు.. దానిప్రకారం ఓటర్ల నమోదు చేసుకోవచ్చు. రెండుచోట్ల ఓట్లు ఉంటే మాత్రం తప్పనిసరిగా తొలగిస్తాం.
– రంగా ప్రసాద్, ఎన్నికల సూపరింటెండెంట్, భద్రాద్రి జిల్లా