రఘునాథపాలెం, జూన్ 15 : సన్నబియ్యం పక్కదారి పట్టకుండా ఖమ్మం జిల్లా పౌరసరఫరా శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించే సన్నబియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. రేషన్‌షాపుల ద్వారా ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే సన్నబియ్యాన్ని అమ్ముకుంటే రేషన్‌కార్డులను రద్దు చేసి, కేసులు నమోదు చేస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్వో) చందన్‌కుమార్ హెచ్చరించారు. ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు.
రేషన్‌బియ్యం అమ్మిన వారితోపాటు కొన్నవారిపైనా కేసులు నమోదు చేస్తామని డీఎస్వో చందన్‌కుమార్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డులపై ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నది. అయితే రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం ఉచితంగా తీసుకుని వాటిని అమ్ముకుంటున్నారనే సమాచారం మేరకు డీఎస్వో నేతృత్వంలో సివిల్ సైప్లె అధికారులు గత మంగళవారం అర్ధరాత్రి తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో దాడి చేసి పౌరసరఫరాల శాఖకు చెందిన 15 క్వింటాళ్ల సన్నబియ్యాన్ని పట్టుకున్నారు. జిల్లావ్యాప్తంగా సన్నబియ్యం పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు డీఎస్వో తెలిపారు.
నిరుపేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీని ఉచితంగా చేపడుతున్నదని, ఆ బియ్యాన్ని అమ్ముకోకుండా ప్రతి వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మేరకు ఊరూరా బియ్యం కొనుగోలుదారులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సన్నబియ్యం పక్కదారి పట్టకుండా చెక్‌పోస్టులో నిఘా పెంచినట్లు తెలిపారు. బియ్యం అమ్ముకున్నట్లుయితే జిల్లా పౌరసరఫరాల శాఖకు సమాచారాన్ని అందజేయాలన్నారు. రేషన్‌షాపుల ద్వారా జరిగే సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని డీఎస్వో చందన్‌కుమార్ తెలిపారు.
ఇప్పటికే జిల్లాలో రేషన్‌షాపుల ద్వారా 70శాతం సన్నబియ్యం పంపిణీ పూర్తయ్యిందని, ఈ నెలాఖరు వరకు అర్హులైన, రేషన్‌కార్డు కలిగిన ప్రతి కార్డుదారుడిని మూడునెలల రేషన్ బియ్యం తప్పకుండా అందజేస్తామన్నారు. మూడునెలల రేషన్‌బియ్యం పంపిణీ నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ వరకు పంపిణీ జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రతి లబ్ధిదారు గుర్తించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రేషన్‌షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఖమ్మంఅర్బన్, రఘునాథపాలెం, ఖమ్మంరూరల్, చింతకాని, కొణిజర్ల, వైరా మండలాల్లో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. రేషన్‌డీలర్లు సమయపాలన పాటిస్తూ లబ్ధిదారులకు ఈ నెలాఖరు వరకు సన్నబియ్యం పంపిణీ చేయాలన్నారు. అంతేకాక యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాకు నిర్దేశించిన వడ్ల కొనుగోళ్ల లక్ష్యాన్ని చేధించినట్లు చందన్‌కుమార్ తెలిపారు.