Special Education Teachers | ఖమ్మం, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘చదువురాని వాడు కాకరకాయ అంటే ఎక్కువగా చదువుకున్న వాడు కీకరకాయ అన్నాడట’ అన్నట్లుగా ఉంది రాష్ట్ర విద్యాశాఖ పరిస్థితి. ప్రత్యేక విద్య (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉపాధ్యాయుల నియామకాలు జరిగి ఆరు నెలలు పూర్తవుతున్నా వారికి నేటికీ ప్రభుత్వం జాబ్చార్టు రూపొందించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల శిక్షణను రేవంత్ సర్కారు గాలికొదిలేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దివ్యాంగుల విద్యా బోధనకు తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ-2024లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ విభాగాల్లో సుమారు 900పైగా పోస్టులను ప్రకటించారు.
వాటికి పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేసి నియామక పత్రాలు అందించారు. గత అక్టోబర్, నవంబర్ నెలల్లో డీఈవోల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో వారికి కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. అప్పటి నుంచి వారు తమకు కేటాయించిన పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు, ప్రత్యేక విద్యకు చెందిన ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లకు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 12 వరకు ఒక్కొక్కరికీ మూడు రోజుల చొప్పున శిక్షణ పక్రియను నిర్దేశిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ నుంచి ఫిబ్రవరి 22న ఉత్తర్వులు వెలువడ్డాయి.
సదరు ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా సాధారణ ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలకు శిక్షణను పూర్తి చేశారు. వారి శిక్షణ జరుగుతున్న సమయంలోనే ప్రత్యేక విద్య ఉపాధ్యాయులకు శిక్షణను నిలిపివేస్తున్నట్లు ఆయా జిల్లాల డీఈవోలకు విద్యాశాఖ నుంచి సంక్షిప్త సందేశాలు వచ్చాయి. తదనుగుణంగా డీఈవోలు ప్రత్యేక విద్య ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్ల శిక్షణను వాయిదా వేశారు. శిక్షణను నిలిపివేస్తున్నట్లు తమకు వచ్చిన అదే సంక్షిప్త సందేశాలను డీఈవోలు సదరు ప్రత్యేక విద్య ఉపాధ్యాయులకు పంపారు. ఇది జరిగి నెల రోజులు పూర్తి కావస్తున్నా నేటీకీ ప్రత్యేక ఉపాధ్యాయుల తదుపరి శిక్షణ షెడ్యూల్ ప్రకటించలేదు. దీంతో వారికి ప్రత్యేక జాబ్చార్టు కూడా రూపొందలేదు. దీంతో ప్రత్యేక విద్య ఉపాధ్యాయులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దివ్యాంగుల విద్య, ఉద్యోగ, జీవన విధానం, వసతి, ప్రభుత్వాల బాధ్యత, దివ్యాంగుల హక్కులు తదితర అంశాలపై (రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్) ఆర్పీడబ్ల్యూడీ-2016 చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఆర్పీడబ్ల్యూడీ-2016 చట్టం ప్రకారం ఉన్నత పాఠశాలలకు చెందిన దివ్యాంగులకు 1:15, ప్రాథమిక పాఠశాలలకు చెందిన దివ్యాంగులకు 1:10 చొప్పున ఆయా పాఠశాలల్లో చేరిన దివ్యాంగ విద్యార్థులకు సకల సౌకర్యాలతోపాటు ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని ఉంది.
దానికి అనుగుణంగా పొరుగునున్న ఏపీలో 2019లోనే దివ్యాంగ విద్యా బోధనకు ఉపాధ్యాయుల శిక్షణ పూర్తయింది. 2023లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ చట్టం ప్రకారం 1,500కు పైగా దివ్యాంగ విద్య ఉపాధ్యాయుల పోస్టుల నియామక ఉత్తర్వులు ఇస్తూ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ.. ఈ లోపే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సదరు పోస్టులను 900కు కుదించి డీఎస్సీ 2024ను విడుదల చేసి నియామక పక్రియ కొనసాగింది. అక్టోబర్లో నియమితులై నేటి వరకు సదరు ప్రత్యేక ఉద్యోగులు జాబ్చార్టు లేక సహిత విద్యా బోధనలో భాగంగా సాధారణ, ప్రత్యేక విద్యార్థులకు కలిపి బోధన కొనసాగిస్తున్నారు. ఈలోపు విద్యా సంవత్సరం కూడా పూర్తి కావొచ్చింది.
సాధారణ ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లతోపాటే తమకూ శిక్షణ ఉంటుందని వేచి చూసిన ప్రత్యేక విద్య ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లకు చివరికి తీవ్ర నిరాశే మిగిలింది. దివ్యాంగుల విద్యా బోధనలో మెళకువలు నేర్చుకుందామని అనుకున్న సదరు ఉపాధ్యాయుల ఆశలు ఆవిరయ్యాయి. మార్చి 1, 2 వారాల్లో శిక్షణ వాయిదా వేసి ఏప్రిల్ నెల రెండో వారానికి చేరుకున్నా ఇప్పటికీ శిక్షణ షెడ్యూల్ ప్రకటించకపోవడంతో ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకటించి, డీఆర్పీల పేర్లు తీసుకొని రాష్ట్రస్థాయిలో ఎస్ఆర్పీలు, జిల్లాస్థాయిలో డీఆర్పీల శిక్షణ అకారణంగా వాయిదా పడడంతో ప్రత్యేక విద్య ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు తీవ్ర నిరాశలో ఉన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం గతంలో రాష్ట్ర విద్యాశాఖలో ఎన్నడూ లేని విధంగా జూలై-2024లో ఒక్కసారిగా 30వేలకు పైచిలుకు ఉద్యోగోన్నతులను ఉపాధ్యాయులకు కల్పించింది. డీఎస్సీ-2024లో నియమితులైన ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తయిన నెల రోజుల వ్యవధిలోనే రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఉద్యోగోన్నతులు పొందిన వారికి సైతం శిక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. దానికి అనుగుణంగా 33 జిల్లాల్లో డీఈవోల ఆధ్వర్యంలో ఉద్యోగోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తయింది.
డీఎస్సీ ఉపాధ్యాయులకు, ప్రమోటెడ్ ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు శిక్షణను పూర్తి చేయకపోవడం, జాబ్చార్టు రూపొందించకపోవడం వంటి అంశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దివ్యాంగ విద్యపై శీతకన్ను వేసిందన్న సందేహాలు స్పష్టమవుతున్నాయి. ఆర్పీడబ్ల్యూడీ-2016 చట్టం ప్రకారం దివ్యాంగులకు చేకూరే అన్ని సదుపాయాలను చట్టంలో పొందుపరిచారు. అయితే, ఈ చట్టం ప్రకారం.. ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల శిక్షణ, జాబ్చార్టును తక్షణం అమలు చేయాల్సి ఉంటుందని పలు ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ.. ప్రభుత్వం ఆ దిశగా చొరవ తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి.