ఒక ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఒక వ్యక్తి దీక్ష దేశ ప్రజలను ఆలోచింపచేసింది. ఒక నాయకుడి ఉపన్యాసం ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. బక్క పలచటి వ్యక్తిపై అచెంచల విశ్వాసం పెట్టుకున్నది అప్పటి వరకూ అణగదొక్కబడిన ఆ ప్రాంతం. అందుకే.. ఆరు దశాబ్దాలు దోపిడీకి గురైన ఆ ప్రాంత ప్రజానీకం ఒక్క గొంతుగా నిలిచింది. ఆత్మహత్యలు, బలిదానాల సాక్షిగా తెగింపునకు సమరశంఖం పూరించింది. అలా పెల్లుబికిన స్వరాష్ట్ర కాంక్షను భుజానిత్తుకున్నాడు ఆ బక్క పలచని వ్యక్తి. ఉద్యమానికి ఊపిరిపోసి చావోరేవో తేల్చుకొనేందుకు తెగించి ముందడుగు వేశాడు. తన దీక్షతో నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలనుకున్నాడు. ఆటుపోట్లకు వెరవలేదు.
ఆమరణ దీక్షకు వెనుకాడలేదు. ఈ క్రమంలో లాఠీ దెబ్బలు తిన్నాడు. జైలు జీవితం గడిపాడు. చివరికి ఆ నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చాడు. వలస పాలనను పారదోలి స్వేచ్ఛావాయువులను ప్రసాదించాడు. ఆ తరువాత తెలంగాణకు పాలనాదక్షుడయ్యాడు. అభివృద్ధి ప్రదాతగా నిలిచాడు. సంక్షేమ సారథిగా కీర్తి గడించాడు. ఆ నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో చెరగని ముద్రను వేసుకున్నాడు. యావత్ దేశ ప్రజలకు దార్శనికుడయ్యాడు. చరిత్రలో మరెవ్వరూ చెరపలేని చిరస్థానాన్ని పొందాడు. అతడే, ఆ బక్కపచని మనిషే.. మన కేసీఆర్ (కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు). నేడు ఆ ఉద్యమసారథి పుట్టిన రోజు (ఫిబ్రవరి 17) సందర్భంగా ప్రత్యేక కథనం.
– ఖమ్మం, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వలస పాలకుల చేతిలో బంధీ అయిన తెలంగాణకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రసాదించాలనుకున్నాడు ఉద్యమ సారథి కేసీఆర్. నీళ్లు, నిధులు, నియామకాల్లో ఆరు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయంపై ఎలుగెత్తాడు ఈ తెలంగాణ ముద్దుబిడ్డ. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేసి అహింసా మార్గంలో ఉద్యమానికి పురుడుపోశాడు ఈ మొండిఘటం. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో..’ అనే నినాదంతో మలి విడత ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. అతడి సారథ్యంలో మలివిడత ఉద్యమం జోరుగా కొనసాగుతోంది.
అప్పటికే 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక తన దీక్షతోనైనా అప్పటి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాలని తలిచాడు. వలస పాలనను పారదోలాలని సంకల్పించాడు. ఆమరణ దీక్షకు దిగాడు. దీనిని జీర్ణించుకోలేని వలస పాలకులు దీక్షను భగ్నం చేయాలనుకున్నారు. కరీంనగర్లో అరెస్టు చేశారు. తీసుకొచ్చి ఖమ్మం జైలులో నిర్బంధించారు. అక్కడ కూడా ఉద్యమసారథి తన దీక్షను కొనసాగించడంతో ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగిసి పడింది. ఈ ఆ చారిత్రక ఘట్టానికి ఖమ్మమే వేదికైంది. ఆ తరువాతే ‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం’ ప్రకటనకు బీజం పడింది.
అది 2009 నవంబర్ 28వ తేదీ. మెదక్ జిల్లా సిద్దిపేట సమీపంలోని రంగదామ్పల్లిలో కేసీఆర్ ఆమరణ దీక్షకు వేదిక సిద్ధమైంది. కరీంనగర్ నుంచి వేదిక వద్దకు దాదాపు 159 వాహనాల భారీ కాన్వాయితో బయల్దేరి వెళ్లిన కేసీఆర్‌ను జిల్లా కేంద్రం పొలిమేర్లలోని అల్గునూర్ వద్ద అప్పటి వలస పాలకులు పోలీసులతో అరెస్టు చేయించారు. అక్కడి నుంచి వరంగల్ మీదుగా ఆంధ్రాలోని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించానుకున్నారు. ఖమ్మంలో తెలంగాణవాదం ఎక్కువగా ఉండదని భావించి పోలీసులు ఇటువైపు దారి మళ్లించారు. అదే రోజు ఖమ్మంలో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.
కేసీఆర్ సహా 9 మందికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం సబ్‌జైలుకు తరలించారు. బెయిల్ ప్రయత్నాలను కేసీఆర్ అంగీకరించలేదు. జైలు నుంచే దీక్షను కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నవంబర్ 29న తెలంగాణ బంద్‌కు టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) పిలుపునిచ్చింది. అదే రోజు న్యాయవాది సుగుణారావు నేతృత్వంలో ఇద్దరు న్యాయవాదులు కేసీఆర్‌ను కలిసి మాట్లాడారు. బయటకు వచ్చి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నట్లు చెప్పారు. సాయంత్ర ఖమ్మం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ పాపాలాల్ ఆధ్వర్యంలో డాక్టర్లు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ధ్రువీకరించారు.
నవంబర్ 30న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని మరోసారి పరిశీలించిన డాక్టర్లు.. ఆయనను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసీఆర్ దీక్షను విరమించారని, ఆయన సూచన మేరకే పండ్ల రసం అందించామని అప్పటి ఏఎస్పీ పరిమళ ప్రకటించారు. అందుకు సంబంధించిన ఫొటోలను, వీడియో టేపులను పత్రికలకు విడుదల చేశారు. దీంతో సర్వత్రా నిర్ఘాంతపోయారు. అర్ధాంతరంగా దీక్షను విరమించడాన్ని సహించని ఓయూ విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
అందుకు కేసీఆర్ స్పందించారు. పోలీసులు, వలస పాలకులు దురుద్దేశంతోనే తన దీక్షను భగ్నం చేసేందుకే కుట్ర పన్నారని స్పష్టం చేశారు. తాను దీక్ష కొనసాగిస్తున్నట్లు తేల్చిచెప్పారు. దీంతో విద్యార్థులు శాంతించారు. చల్లారి పోయిందనుకున్న అగ్గి రాజుకొని నిప్పులకొలిమై నింగినంటింది. ఉద్యమ స్వరూప స్వభావాన్నే మార్చివేసింది. ఉద్యమాల పురిటి గడ్డ ఖమ్మం వేదికగా జరిగిన ఈ ఘటన ఇప్పటికీ ఉద్యమ ప్రస్థానంలో ప్రధానంగా నిలిచిపోయింది.
2009 డిసెంబర్ 1న రాత్రి ఖమ్మం ఆసుత్రిలో కేసీఆర్ కలిశాను. ఆ రోజు కేటీఆర్, హరీశ్‌రావును కూడా ఆసుపత్రిలోకి రానివ్వలేదు. ఆ సమయంలో నేను కేసీఆర్‌తోనే ఆసుపత్రిలో ఉన్నాను. నా ఫోన్ నుంచే మానవ హక్కుల చైర్మన్‌తోనూ, ఆనాటి సీఎం రోశయ్యతోనూ కేసీఆర్ మాట్లాడారు. బయటకు రాగానే పోలీసులు నా ఫోన్ లాక్కున్నారు. ఆ రోజున కేసీఆర్‌ను కలవడం, ఆయనతో ఉద్యమకారుడిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నాను. అసలు కేసీఆర్‌ను కలుస్తానని జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు.
-బిచ్చాల తిరుమలరావు, న్యాయవాది, అప్పటి న్యాయవాద జేఏసీ చైర్మన్
కేసీఆర్ నన్ను తన కుటుంబ సభ్యుడిగా భావిస్తారు. ఆయన స్ఫూర్తితోనే 2008లో తెలంగాణ ప్రైవేటు పాఠశాలల యజమాన్యాల సంఘాన్ని ఏర్పాటు చేశాను. ఖమ్మంలో ఆనాడు ‘జై తెలంగాణ’ అనేందుకు చాలామందికి ధైర్యం లేదు. అలాంటి సమయంలో తెలంగాణ పట్ల ఉన్న ప్రేమతో, కేసీఆర్ పట్ల ఉన్న అభిమానంతో ఖమ్మంలో తొలిసారి తెలంగాణ పేరుతో పాఠశాలల యూనియన్ను ఏర్పాటు చేయడం సాహసమే. కేసీఆర్ 2 సార్లు మా ఇంట్లో బస చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను.
– ఆర్జేసీ కృష, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు
వలస పాలకులు కేసీఆర్‌పై దేశ ద్రోహం కేసు పెట్టి ఖమ్మం జైలుకు తరలించారు. ఆ కేసులో కేసీఆర్ ఏ-1గా, నేను ఏ-2గా ఉన్నాం. నాతోపాటు నాయిని నర్సింహారెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డాక్టర్ విజయరామారావు, కన్నెబోయిన రాజయ్యయాదవ్ ఉన్నారు. వీరితోపాటు ఖమ్మానికి చెందిన బత్తుల సోమయ్య, గోపగాని శంకర్రావు, అబ్దుల్ నబీ కూడా జైల్లోనే ఉన్నారు. కేసీఆర్, నేను పక్క పక్క బెడ్లలోనే ఉన్నాం. మహత్తర ఉద్యమంలో ఆయన భాగస్వామిగా ఉండడంతో నా జీవితం సార్థకమైనట్లయింది.
-డోకుపర్తి సుబ్బారావు, తెలంగాణ ఉద్యమకారుడు
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి నడవడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆనాడు కేసీఆర్‌ను అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తీసుకెళ్తున్నప్పుడు మేం భయపడ్డాం. అక్కడ కేసీఆర్‌ను చంపుతారేమోననే అనుమానం కలిగింది. కేసీఆర్ లేకపోతే రాష్ట్రం రాదు. టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) ఏమవుతుందోనన్న ఆందోళన మొదలైంది. ఆ తరువాత కేసీఆర్‌ను ఖమ్మం జైలుకు తీసుకురావడంతో మేమంతా రోడ్డెక్కి ఉద్యమించాం. లాఠీ దెబ్బలు తిన్నాం. ఖమ్మంలో టీఆర్ఎస్ మూడో సభ్యుడిని నేనే.
-పగడాల నరేందర్, ఉద్యమకారుడు