ఖమ్మం రూరల్, జూలై 03 : ఏదులాపురం మున్సిపాలిటీ సుందరీకరణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 26, 27వ వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ పి.అనితతో కలిసి కమిషనర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణకు గాను స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగానే తొలి విడతగా మొత్తం 32 వార్డులకు గాను 10 వార్డులను ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఎంపిక చేసిన వార్డుల్లో సైడ్ కాలువల పూడికతీత, జంగిల్ కటింగ్, సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. ప్రధానంగా వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని వార్డులలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు గాను ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మురుగునీరు నిల్వల ప్రదేశాలు, పురాతన భవనాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎంసీ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, వార్డు కౌన్సిలర్లు కడవ నవీన్, బి.దివ్య, మహేశ్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి.వీరన్న, మున్సిపల్ సిబ్బంది కిరణ్, హుసేన్ పాల్గొన్నారు.