కొత్తగూడెం ప్రగతి మైదాన్, జనవరి 31: పోలీసు శాఖలో పనిచేసే ప్రతీ ఉద్యోగి క్రమశిక్షణ, బాధ్యతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. పోలీస్ శాఖలో సాయుధ బలగాలకు 15 రోజులుగా నిర్వహించిన మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ పరేడ్‌లో భాగంగా గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్‌కు అడ్మిన్ ఆర్ఐ లాల్‌బాబు ప్లాటూన్ కమాండర్‌గా వ్యవహరించారు. 15 రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఇండోర్, ఔట్‌డోర్, ఫైరింగ్ ప్రాక్టీస్‌లలో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారని ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ ఎస్పీకి వివరించారు. ఈ సదర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొబిలైజేషన్ కార్యక్రమం ద్వారా శారీరక దృఢత్వంతోపాటు మానసికోల్లాసం లభిస్తుందన్నారు.
పోలీస్ శాఖలో విశిష్ట సేవలందించిన అధికారులు, సిబ్బందికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెడల్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లా నుంచి ఎంపికైన 260 మంది అధికారులు, సిబ్బందికి ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా వాటిని అందజేశారు. పోలీస్ శాఖలో వారి సేవలకు విభాగాల వారీగా కఠిన సేవా, ఉత్తమ సేవా, సేవా పతకాలతోపాటు యాంత్రిక్ సురక్షా సేవా పతకాలను పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని పరేడ్ మైదానంలో బహూకరించారు. పోలీసు అధికారులు కురసం సత్యనారాయణ, నాగరాజు, చెన్నూరి శ్రీనివాస్, నర్సింహారావు, సుధాకర్, కృష్ణారావు పాల్గొన్నారు.