కొత్తగూడెం క్రైం, మే 12 : శాంతియుత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్‌రాజు అన్నారు. కొత్తగూడెం రామచంద్ర డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రూట్ మొబైల్స్, పోలింగ్ కేంద్రాల బందోబస్తు అధికారులు, సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయయ సంఘటనలకు తావులేకుండా ప్రతీ అధికారి, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎవరికి కేటాయించిన విధులను వారు బాధ్యతగా నిర్వర్తించి పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు కృషి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి విక్రాంత్ సింగ్, కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.