కొణిజర్ల, నవంబర్ 18: గతంలో రుణమాఫీల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అన్నదాతలను నిలువునా మోసం చేసిందని, ఇప్పుడు మళ్లీ అదే పేరు కర్షకులను దగా చేసేందుకు మాయమాటలతో హామీలు ఇస్తోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. అప్పుడు సక్రమంగా రుణమాఫీ చేయకుండా వడ్డీలతో రైతుల నడ్డి విరిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని దుయ్యబట్టారు. అందుకే తెలంగాణ సాధించాక సీఎం కేసీఆర్ అన్నదాతల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారని గుర్తుచేశారు. అనేక పథకాలు తెచ్చారని వివరించారు. రైతుబంధు పథకం తెచ్చి పంటల సాగుకు ముందుగానే పెట్టుబడి సాయం అందిస్తున్నారని గుర్తుచేశారు. రైతుల కోసం దేశంలోనే మరెక్కడా లేనన్ని పథకాలు తెలంగాణలోనే కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఒక్క రైతుబంధు పథకం ద్వారానే రూ.73 వేల కోట్లను వెచ్చించి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కుతుందని స్పష్టం చేశారు. కొణిజర్ల మండలంలో శనివారం పర్యటించి ఆయన..
వైరా ఎమ్మెల్యే రాములునాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ గెలుపును కాంక్షిస్తూ ఆయనతో కలిసి అంజనాపురం, గుబ్బగుర్తి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ.. అన్నదాతలకు అండగా నిలిచిన బీఆర్ఎస్ సర్కారుకు రైతులు కూడా తోడుగా నిలవాలని కోరారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే మరిన్ని పథకాలు అందుతాయని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌లాల్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ ఎన్నికల్లో తనకు అధిక మెజార్టీ అందించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు వై.చిరంజీవి, ఏలూరి శ్రీనివాసరావు, పోట్ల కవిత, మాన్సింగ్, మీర్జారోశన్ బేగ్, పోట్ల శ్రీనివాసరావు, కిలారు మాధవరావు, డేరంగుల బ్రహ్మం, పోగుల శ్రీను, పాసంగులపాటి శ్రీను, కిలారు కిరణ్, జడ మల్లేశ్‌యాదవ్, సాయిన్ని నర్సయ్య, మోరంపూడి ప్రసాద్, దావా విజయ్, తాటి శ్రీను, అనుమోలు శ్రీనివాసరావు, దుగ్గిన్ని శ్రీను, రావుల వెంకయ్య, కుమ్మరి గంటయ్య, షేక్ మౌలానా, కుమ్మరి నాగేశ్వరరావు, జక్కంపుడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.