కారేపల్లి, మార్చి 17 : సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను తరలించేది జిల్లా ప్రజల సౌకర్యార్థమా లేక మంత్రుల సాగు భూములకా అని తెలంగాణ ఆదివాసి సంక్షేమ పరిషత్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వట్టం నాగేశ్వరరావు ప్రశ్నించారు. కారేపల్లి మండల కేంద్రంలో గల కొమరం భీమ్ సెంటర్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం వల్ల పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గ ప్రజలు తమ బీడు భూములు సాగు భూములుగా మారుతాయని ఎంతో ఆశపడ్డారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆశలను నిర్వీర్యం చేస్తూ ఏజెన్సీ ప్రాంతాలకు చుక్క నీళ్లను ఇవ్వకుండా అన్యాయానికి గురిచేస్తుందన్నారు. ఏజెన్సీ ప్రాంత నీళ్లను ఖమ్మం జిల్లాలోని మంత్రులు పొంగులేటి, తుమ్మల, భట్టిల భూములకు ఉపయోగపడే విధంగా తరలిస్తున్నారని ఆరోపించారు.
ఈ ప్రాంత హక్కులను కాపాడాల్సిన ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివాసీల రక్షణ గురించి మాట్లాడక పోవడంతో పాటు పాలక ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగా ఈ ప్రాంత శాసనసభ్యులు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కాల్వలు తవ్విన రైతుల భూముల్లో చుక్క నీళ్లు ముట్టే పరిస్థితులు లేవన్నారు. జిల్లాలో నలుగురు ఆదివాసి ఎమ్మెల్యేలు ఉండి కూడా సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఖమ్మం, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు తరలిస్తుంటే చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. సీతారామ ప్రాజెక్టు నీళ్లు జిల్లా రైతులందరి భూములకు అందే వరకు ఎమ్మెల్యేల కార్యాలయాలను ముట్టడించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ఈసాల సురేశ్, పూనెం శివరాం, వాగబోయిన చంద్రయ్య దొర, చీమల వెంకటేశ్వర్లు, రామచంద్రు పాల్గొన్నారు.