– 23,116 మంది ఓటర్లకు నోటీసులు
– ఇప్పటికే 9.926 ఓటర్లు తొలగింపు
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 03 : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్ ) రెండవ విడత ప్రక్రియ ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీలో శరవేగంగా సాగుతుంది. సార్ మొదటి దశ మ్యాపింగ్ ప్రక్రియలో పాలేరు నియోజకవర్గం జిల్లాలో మొదటి స్థానం, రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచిన సంగతి తెలిసింది. రెండవ విడత ప్రక్రియలో సైతం అదే ఒరవడి కొనసాగించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రూరల్ మండలం, మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 101 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వీటి పరిధిలో 94,818 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ అనంతరం చనిపోయిన, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ జరిగిన ఓటర్ల తొలగింపు ప్రక్రియ తర్వాత 84,892 మంది ఓటర్లు మిగిలారు. మొత్తం ఓటర్లలో 9926 మంది ఓటర్లు తొలగిపోయినట్లు అయింది. మ్యాపింగ్ ప్రక్రియ తర్వాత 2002 ఓటర్ల జాబితా లో లింకు కానీ ఓటర్లు, పేర్లు తప్పు, వయసు నిర్ధారణ సరిగ్గా లేని కారణంగా ఎన్నికల అధికారులు 23,116 మందికి నోటీసులు జారీ చేసే కార్యక్రమం చేపట్టారు.
ఇప్పటికే నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అధికారులు స్వీకరిస్తున్నారు. ప్రతి 10 పోలింగ్ కేంద్రాలకు ఒక ఏఈఆర్ఓ స్థాయి అధికారిని నియమించడం జరిగింది. ఈనెల 17 లోపు నోటీసులు అందుకున్న మొత్తం ఓటర్ల నుంచి ధ్రువీకరణ పత్రాలను స్వీకరించే విధంగా కార్యాచరణ రూపొందించి, పోలింగ్ కేంద్రాల వారిగా ప్రత్యేక హియరింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఓటర్ల నుంచి ధ్రువీకరణ పత్రాలను స్వీకరిస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఈ నెల 17వ తేదీ లోపు ప్రక్రియ పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని. నివారణ కారణాలవల్ల నోటీసులు అందుకున్న ఓటర్లు ధ్రువీకరణ పత్రాలను అందజేసేందుకు మరో అవకాశం ఇవ్వడం జరుగుతుందని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నోటీసులు అందుకున్న ఓటర్లు వారికి నిర్దేశించిన తేదీ, సమయానికి అనుగుణంగా అధికారులకు దృవీకరణ పత్రాలను అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈఎంసీలో శరవేగంగా సర్ ప్రక్రియ