కొత్తగూడెం సింగరేణి, మార్చి 29 : సింగరేణి విజిలెన్స్ అధికారులు కొత్తగూడెం కార్పొరేట్ ప్రధాన ఆస్పత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంవో)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సుజాత కార్యాలయంలో శనివారం సాయంత్రం దాడులు చేపట్టారు. డాక్టర్ సుజాత సీఎంవోగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బోర్డు మెడికల్లో వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో దాడులు జరిగినట్లు తెలుస్తున్నది. సీఎంవోకు సంబంధించిన సెల్ ఫోన్లు, ఇద్దరు డ్రైవర్ల సెల్ ఫోన్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అలాగే వారి బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలించినట్లు తెలిసింది. ఈ నెల 31న ఉద్యోగ విరమణ పొందనున్న సీఎంవోపై రెండు రోజుల ముందు విజిలెన్స్ అధికారులు విచారణ జరపడం, ఆ సమయంలోనే ఆమెకు హెడ్డాఫీస్లో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయడం, అది ముగిసిన తర్వాత తిరిగి విజిలెన్స్ అధికారులు హెడ్డాఫీస్లోని విజిలెన్స్ కార్యాలయానికి తరలించి విచారించినట్లు తెలిసింది.
ఆమె బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఇప్పుడు విజిలెన్స్ అధికారులు విచారణ చేయడం కంటితుడుపు చర్య అని, వారి వైఫల్యానికి ఇది నిదర్శనమని కార్మికులు, కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కార్మికులకు ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కారుణ్య నియామకాల పేరుతో ఇటు డాక్టర్లు, అటు కార్మిక సంఘాల నాయకులు కార్మికుల నుంచి లక్షలాది రూపాయలు దండుకోవడం సరైంది కాదని, వివిధ రుగ్మతలు ఉన్న కార్మికులను మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి వారసులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని టీబీజీకేఎస్ డిమాండ్ చేస్తున్నది.