కొత్తగూడెం సింగరేణి, జూన్ 21 : వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి సంస్థ విద్యుత్ ఉత్పాదన రంగంలోకి అడుగిడింది. ఇప్పటికే థర్మల్, సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పిన సంస్థ రామగుండం-1 ఏరియాలో మూతబడిన మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ గనిని వాటర్ సంపు ఆధారంగా పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్(పీఎస్పీ) ఏర్పాటుకు పూనుకుంది. దీనిపై ప్రాజెక్టు రిపోర్టు రూపొందించడానికి ప్రభుత్వరంగ సంస్థ వ్యాప్కోస్ లిమిటెడ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ లెటర్ ఆఫ్ అవార్డును అందజేసినట్లు సీఎండీ బలరాం వెల్లడించారు.
ఈ తరహా ప్రాజెక్టు ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడా చేపట్టలేదని, సింగరేణి సంస్థ దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టడమే కాక విజయవంతంగా నిర్వహిస్తుందన్న నమ్మకం తమకు ఉన్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ అప్పగించిన బాధ్యతల ప్రకారం వ్యాప్కోస్ సంస్థ మేడిపల్లి ఓపెన్ కాస్ట్ సంపు ఆధారంగా 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి అధ్యయనం చేస్తోంది. జియోలాజికల్, జియోటెక్నికల్, హైడ్రాలజీ అధ్యయనాలతోపాటు సివిల్ డిజైన్లు, ఉత్పత్తి సామర్థ్య అంశాలు, మెకానికల్, ఎలక్ట్రికల్ డిజైన్లు, పర్యావరణ సంబంధ అంశాలు, రక్షణ చర్యల వంటి విషయాలపై సమగ్ర అధ్యయనం చేసి డీపీఆర్‌ను రూపొందించాల్సి ఉంటుంది.
ప్లాంట్ నిర్మాణానికి పట్టే సమయం, నిర్మాణ ఖర్చు, ప్లాంట్ పూర్తయిన తర్వాత ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ అమ్మకాలకు గల అవకాశాలను డీపీఆర్‌లో పొందుపర్చనున్నారు. ప్రస్తుతం మేడిపల్లి ఓసీలో సుమారు 157 మీటర్ల లోతున భారీ నీటి సంపులో ఏడాది పొడవునా భారీ పరిమాణంలో నీటి నిల్వ ఉంటుంది. ఈ నీటిని ఉపరితలంపై నిర్మించనున్న దాదాపు ఇదే పరిమాణం గల మరో భారీ నీటి రిజర్వాయర్‌లోకి పగటి పూట సోలార్ విద్యుత్ ద్వారా పంపింగ్ చేస్తారు.
ఇలా పగటి పూట నింపిన నీటిని భారీ పైపుల సహాయంతో రాత్రివేళ కిందికి పంపిస్తూ ఆ జలశక్తి ద్వారా మధ్యలో ఏర్పాటు చేసిన టర్బైన్లను తిప్పడం వల్ల విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ జరుగుతుంది. హైదరాబాద్ సింగరేణి భవన్లో శనివారం జరిగిన ఒప్పంద సమావేశంలో సంస్థ డైరెక్టర్లు సత్యనారాయణరావు, ఎల్వీ సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, ఈడీ సుభాని, జీఎంలు మనోహర్, సుబ్బారావు, సంబంధిత జీఎంలు పాల్గొన్నారు.