కొత్తగూడెం సింగరేణి, మార్చి 14: సింగరేణి వ్యాప్తంగా కొత్త బొగ్గు గనుల ఏర్పాటే లక్ష్యంగా పని చేస్తామని నూతన డైరెక్టర్ (పా)గా బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్(పీపీ) కే.వెంకటేశ్వర్లు తెలిపారు. డైరెక్టర్ (పా)గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హెడ్డాఫీస్కు వచ్చిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
కొత్త గనుల ఏర్పాటులో భాగంగా కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓసీ, ఇల్లెందు ఏరియాలోని జేకే ఓసీ విస్తరణ అనుమతుల కోసం ఈసీ (ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్)లో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి, తుది అనుమతుల కోసం కృషి చేస్తున్నామన్నారు. రానున్న రెండు నెలల కాలంలో ఈ రెండు ఓసీలను ప్రారంభించి సంస్థ లక్ష్య సాధనకు కృషి చేస్తామన్నారు. వీటితోపాటు మిగతా ఏరియాల్లో వివిధ దశల్లో ఉన్న నూతన బొగ్గు గనుల అనుమతుల కోసం కృషి చేసి, వాటిని కూడా ప్రారంభించి ఉత్పత్తి లక్ష్య సాధనకు తోడ్పడుతామని ఆయన పేర్కొన్నారు.