సింగరేణి.. నల్ల బంగారాన్ని తనలో ఇముడ్చుకున్న నేల.. కనకరాశులకు తీసిపోని విధంగా బొగ్గు నిక్షేపాల అవని.. ఇందులోని ప్రతి గనీ.. ఓ సిరుల మాగాణే. వందేండ్లకు పైగా బొగ్గు తవ్వకాలు జరుపుతున్నా.. తరగని సిరిసపందగా నిలిచి ప్రపంచ ఖ్యాతి గడించింది. స్వరాష్ట్రం రాకముందు దోపిడీతో దగాపడిన సింగరేణికీ.. తెలంగాణ వచ్చిన తర్వాత కార్మిక పక్ష సింగరేణికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఆరు జిల్లాల్లో విస్తరించి రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆ ‘సిరుల గని సింగరేణి’ పుట్టినరోజు నేడు. అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో.. పర్యావరణ హిత మైనింగ్ చేపడుతూ.. కార్మిక సంక్షేమమే లక్ష్యంగా విరాజిల్లుతూ చరిత్ర సిగలో మన సింగరేణి ఓ కలికితురాయిగా నిలిచింది.
సింగరేణి కాలరీస్ కంపెనీ 13వ దశాబ్దాల మహోన్నత చరిత్రలో తనలో దాచుకొంది. 1920 డిసెంబరు 23న ‘సింగరేణి కాలరీస్ కంపెనీ’గా అవతరించిన నాటి స్మృతులను గుర్తుచేసుకుంటూ డిసెంబరు 23న సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలను సింగరేణి వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నది. 1945లో నాటి హైదరాబాద్ రాష్ట్ర నిజాం సింగరేణి షేర్లను కొనుగోలు చేసి సంస్థ యాజమాన్యాన్ని స్వీకరించారు. అప్పుడే దేశంలో తొలి ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపు పొందింది. దేశ స్వాతంత్య్రానంతరం 1950లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యానికి వచ్చింది. 1960లో కేంద్ర ప్రభుత్వం కూడా భాగాస్వామ్యంగా మారగా.. నాటి నుంచి కేంద్ర రాష్ట్రప్రభుత్వాల ఉమ్మడి సంస్థగా 49:51 షేర్ల భాగస్వామ్యంతో కొనసాగుతుంది సింగరేణి. తొలుత 1889లో ఇల్లెందు ఏరియాలో బొగ్గు తవ్వకాలు జరిపిన కంపెనీ తదుపరి 39 సంవత్సరాల తరువాత 1928లో బొగ్గు గనులను ప్రారంభించింది. మరో తొమ్మిదేండ్లు తరువాత 1937లో కొత్తగూడెంలో బొగ్గు గనులు తెచ్చింది. ఈ మూడు ఏరియాలు స్వాతంత్య్రం రాకముందే ప్రారంభమయ్యాయి. ఆ తరువాత 1975లో శ్రీరాంపూర్, మణుగూరు ఏరియాల్లో బొగ్గు గనులకు శ్రీకారం చుట్టింది. 1991లో భూపాలపల్లి ఏరియాలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించింది కంపెనీ. ప్రస్తుతం 11 ఏరియాల్లో వివిధ రకాల ఆధునిక టెక్నాలజీతో బొగ్గు ఉత్పత్తి చేస్తుంది కంపెనీ.
ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీనీ అమలుచేస్తూ సింగరేణిలో 2018-19 నాటికి మొత్తం 48 గనులు ఉండగా వీటిలో 30 భూగర్భ గనులు, 18 ఓపెన్‌కాస్టుల నుంచి బొగ్గు ఉత్పత్తి నిర్వహిస్తున్నారు. సింగరేణికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే దేశంలో వివిధ అత్యాధునిక టెక్నాలజీని తొలిసారిగా అమలు జరిపిన కంపెనీగా పేరుంది. 1948లోని జాయ్లోడర్, షటిల్ కార్లను ప్రవేశపెట్టి యాంత్రీకరణకు శ్రీకారం చుట్టింది. 1948లో విద్యుత్ మైనింగ్ (షటిల్కార్), 1951లో ఎలక్ట్రికల్ కోల్ రీల్, 1953లో ఎలక్ట్రిక్ క్యాప్ ల్యాంప్, 1964లో ఎలక్ట్రిక్ ఎక్యూప్మెంట్, 1975లో ఓపెన్‌కాస్ట్ మైనింగ్, 1979లో సైడ్ డిశ్చార్జ్ లోడర్ (ఎస్డీఎల్), 1981లో లోడ్ ఆల్ డంపర్స్ అండ్ ఎల్‌హెచ్‌డీ, 1983లో లాంగ్వాల్ మైనింగ్, 1986లో వాకింగ్ డ్రాగ్‌లైన్, 1989లో ఫ్రెంచ్ బ్లాస్టింగ్ గ్యాలరీ మెథడ్, 1994లో ఇన్పిట్ క్రషింగ్ అండ్ కన్వేయింగ్, 2002లో మ్యాన్‌రైడింగ్ సిస్టం, 2003లో ఫేసింగ్ అవుట్ మాన్యువల్ కోల్ ఫిల్లింగ్, 2007లో 3డీ లేజర్ స్క్యానర్, 2008లో ఈఆర్పీ (షాప్), డీజిల్ ఆపరేటెడ్ (యూజీ) మెషనరీ, 2009లో లైట్‌వెయిట్ క్యాప్ ల్యాంప్, 2010లో హైవాల్ మైనింగ్, 2014లో హైకెపాసిటీ లాంగ్వాల్ (అడ్రియాలా), 2015లో మైన్ క్రషర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి.ప్రమాదాలను కూడా దాదాపు పూర్తిగా తగ్గించింది. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టి సింగరేణి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. కారుణ్య నియామకాలకు శ్రీకారం చుట్టారు. కార్మికులకు లాభాల్లో వాటా పెంచారు. వారి సంక్షేమం కోసం కృషి చేశారు.
తెలంగాణకు కొంగు బంగారంమైన సింగరేణి కాలరీస్ లిమిటెడ్ అద్భుత ప్రతిభను సాధించి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రభుత్వ రంగ సంస్థలకే తలమానికంగా నిలిచింది. ముఖ్యంగా అమ్మకాలు లాభాల్లో తన చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డుగా అత్యధిక వృద్ధిరేటును నమోదుచేసి దేశంలోనే 8 మహారత్న కంపెనీలు సాధించిన దానికన్నా ఎంతో ఎక్కువగా సాధించి తన సత్తాను చాటుకుంది. సింగరేణి సంస్థ అమ్మకాలలో అద్భుతమైన వృద్ధిని కనబరిచింది.
దేశంలోనే ఏ బొగ్గు పరిశ్రమలోనూ చేపట్టని విధంగా సింగరేణి సంస్థ థర్మల్ విద్యుత్ ఉత్పాదకతను పూనుకున్నది. రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తాను స్వతాహగా మంచిర్యాల జిల్లా జైపూర్వద్ద 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. 2016 ఆగస్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి పారంభించింది. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో అభివృద్ధి సాధిస్తూ సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు ఇస్తోంది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సహకరిస్తూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద ఏటా కోట్లాది రూపాయలు వెచ్చించి గని ప్రభావిత గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నది. ఆయా ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాల్లో పెంపునకు చర్యలు తీసుకుంటున్నది. వివిధ విభాగాల్లో ఖాళీలను గుర్తించి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ను కేవలం ప్రతిభ ఆధారిత, రాత పరీక్షద్వారా చేపడుతున్నది. రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 15,832 మందికి కారుణ్య నియామక పత్రాలు అందించింది. ఎక్స్టర్నల్ పరీక్షల ద్వారా 4,211 మందికి ఉద్యోగోన్నతులు కల్పించింది.