కూసుమంచి (నేలకొండపల్లి), ఫిబ్రవరి 12: తెలుగు ప్రజలు గర్వించదగిన వాగ్గేయకారుడు.. భక్తాగ్రేసరుడు శ్రీరామదాసు(కంచెర్ల గోపన్న) అని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఏఈవో శ్రావణ్‌కుమార్ కొనియాడారు. శ్రీరామదాసు స్వస్థలమైన ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండల కేంద్రంలో సోమవారం జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ భక్త రామదాస విద్వత్ కళాపీఠం సౌజన్యంతో మరో రెండు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. తొలిరోజు ఉత్సవాలకు శ్రావణ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నేలకొండపల్లిలోని ధ్యాన మందిరంలో ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భద్రాచలంలో రాముడి గుడి నిర్మాణంలో శ్రీరామదాసు కృషి ఎనలేనిదన్నారు. శ్రీరామదాసు దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన వాగ్గేయకారుడన్నారు. అనంతరం సంగీత విద్యాంసుల నవరత్న గోష్ఠి వీనుల విందుగా సాగింది. రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన విద్యాంసులు, గాయకులు శ్రీరామదాసు కీర్తనలను ఆలపించారు. ధ్యానమందిరంలో శ్రీరామచంద్రస్వామి ఆలయంలోని స్వామివారికి కంచెర్ల గోపన్న పదోతరం వారసుడు కంచెర్ల శ్రీనివాస్ పట్టువస్ర్తాలు సమర్పించారు. కార్యక్రమంలో శ్రీ భక్త రామదాస విద్వత్ కళాపీఠం అధ్యక్షుడు సాధు రాధాకృష్ణ మూర్తి, జిల్లాపరిషత్ వైస్ చైర్ పర్సన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, ఎంపీటీసీలు దోసపాటి కల్పన, బొడ్డు బొందయ్య, శీలం వెంకటలక్ష్మి, భక్త రామదాసు సర్వీస్ సోసైటీ అధ్యక్షుడు పాలడుగు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం, ఫిబ్రవరి 12: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో సోమవారం వాగ్గేయకారుడు శ్రీరామదాసు (కంచెర్ల గోపన్న) జయంత్యుత్సవాలు ప్రారంభమయ్యాయి. దేవస్థానంతో పాటు శ్రీచక్ర సిమెంట్స్, నాద సుధా తరంగిణి కల్చరల్ ట్రస్ట్, సామ గాన లహరి కల్చరల్ ట్రస్ట్, నేండ్రగంటి అలివేలు మంగ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. తొలిరోజు ఉత్సవంలో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని శ్రీరామదాసు విగ్రహానికి పంచామృతాలతో అభిషేకించారు. మేళ తాళాలు, వేద మంత్రోచ్ఛరణ నడుమ శ్రీరామదాసు చిత్రపటంతో ఆలయ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ చేశారు. ఆలయ పరిధిలోని చిత్రకూట మండపంలో సంగీత విద్యాంసులు మల్లాది బ్రదర్స్ పర్యవేక్షణలో మందలాది మంది గాయకులు శ్రీరామదాసు కీర్తనలను ఆలపించారు. వేడుకల్లో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు సౌందర్య రంగరాజన్, భద్రాచలం రామాలయ ఈవో ఎల్.రమాదేవి, ఆలయ ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, పొడిచేటి సీతారామానుజాచార్యులు, దేవస్థాన ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి పాల్గొన్నారు.