కారేపల్లి, జూలై 29 : విశాఖ స్టీల్ ప్లాంట్ అనుబంధ సంస్థ డోలమైట్ మైన్ కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడిగా శివాజీ, ప్రధాన కార్యదర్శిగా బి.వీరు ను ఎన్నుకున్నట్లు యూనియన్ నాయకులు రామకృష్ణ తెలిపారు. సింగరేణి మండలం మాదారం డోలమైట్ మైన్స్ యూనియన్ కార్యాలయంలో మంగళవారం రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఏఐటీయూసీ అధ్యక్షుడిగా కొల్లి శివాజీ, గౌరవ అధ్యక్షుడిగా కొల్లి వీరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎం.శివలాల్, వైస్ ప్రెసిడెంట్‌గా కె.వి.ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా బి.ఈరు, అదనపు కార్యదర్శిగా బి.చందు, కోశాధికారిగా సీహెచ్.గోపాల్ రావు, ఉప కోశాధికారిగా అబ్దుల్ అజీజ్, బి.రాందాస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ బి.మోహన్‌ను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులైన శివాజీ, ఈరు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు యూనియన్ తరపున నిరంతర పోరాటం కొనసాగిస్తామన్నారు. డోలమైట్ మైన్స్‌లో ఖాళీ అయిన ఉద్యోగాలు యాజమాన్యం తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ప్రభావిత గ్రామాల్లో అభివృద్ధి పనులకు యాజమాన్యం నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.