ఆది దంపతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మహా శివరాత్రి సందర్భంగా శనివారం అర్ధరాత్రి 12 గంటలకు భక్తజన సమూహం, మంగళవాయిద్యాల నడుమ శివపార్వతుల పెళ్లి తంతు కమనీయంగా.. రమణీయంగా సాగింది. దేవతామూర్తులను భక్తులు కనులారా చూసి పరవశించిపోయారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు ఆదివారం రెండోరోజూ కిక్కిరిశాయి. శివనామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగాయి. తీర్థాల మాడవీధుల్లో భక్తుల కోలాటం మధ్య పార్వతీ సంఘమేశ్వర గ్రామోత్సవం (ఊరేగింపు) వైభవంగా జరిగింది. ఆయా ఆలయాల్లో మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ తదితర నాయకులు పాల్గొని పూజలు నిర్వహించారు.
మహా శివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం అర్ధ రాత్రి శివపార్వతుల కల్యాణం కనుల పండువగా జరిగింది. రెండోరోజు ఆదివారం శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోగా.. మాఢవీధుల్లో శివనామస్మరణ మార్మోగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆలయాల్లో ప్రముఖులు పూజలు చేశారు. ఖమ్మం నగరంలోని గుంటుమల్లేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మణుగూరు నీలకంఠేశ్వరుడి ఆలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, పాపకొల్లు శివాలయంలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, వందనం గ్రామంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, టేకులపల్లి మండలంలో జరిగిన కల్యాణ తంతులో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పాల్గొన్నారు.