ఎందరో రోగుల ప్రాణాలు నిలబెట్టింది. ఎందరో గర్భిణులకు ప్రసవాలు చేసింది. క్షతగాత్రులకు చికిత్స అందించి బాగు చేసింది. ఏళ్లు గడిచిపోవడంతో ఆ ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరింది. తెలంగాణ ప్రభుత్వం పడకల స్థాయి పెంచి కొత్త భవనం నిర్మాణానికి పూనుకుంది. సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో 1970లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నిర్మించగా ప్రజలకు సేవలందించింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఆస్పత్రి బాగోగులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో శిథిలావస్థకు చేరిన భవనంలోనే రోగులకు వైద్య సేవలు అందుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. రూ.35కోట్లతో సత్తుపల్లిలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గత ఏడాది శంకుస్థాపన చేసిన విషయం విదితమే. దీంతో ఆస్పత్రి నిర్మాణ పనులు చకచకా కొనసాగుతూ చివరి దశకు చేరాయి. గత పాలకుల హయాంలో అసౌకర్యాల మధ్య రోగులకు వైద్య సేవలు అందించిన ఆస్పత్రి త్వరలోనే నూతన భవనంగా రూపుదిద్దుకోవడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – సత్తుపల్లి, జూలై 3