కారేపల్లి : అకాల వర్షం ( Unseasonal Rains ) తో చేతికొచ్చిన మొక్కజొన్న ( Maize ) పంటలు నేలకొరకడంతో పాటు కల్లంలో ఎండబోసిన ధాన్యం తడిసి ముద్దవ్వడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. పండుగలా కనిపించిన పంట చేలు ఒక్కసారిగా వర్షం ధాటికి నేలమట్టమయ్యాయి.
ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని పలు గ్రామాల్లో వచ్చిన వర్షంతో మొక్కజొన్న పంట పూర్తిగా నేలకొరిగింది. కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంట గాలి వానకు తట్టుకోలేక వాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. విత్తనాల నుంచి ఎరువుల వరకు భారీ ఖర్చులు పెట్టిన రైతులు,అప్పులు చేసి సాగు చేసిన పంటలు కళ్లముందే నాశనమవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క వానతో తమ కష్టం నీటిలో కలిసిపోయింది అంటూ రైతులు కన్నీరు పర్యంత మయ్యారు. మండల పరిధిలోని మాదారం గ్రామంలో ఇటీవల కారేపల్లి విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో రైతులు పెద్ద మొత్తంలో ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఎండలో ఆరబెట్టారు.

సుమారు పదివేల ధాన్యం బస్తాలకు పైగా కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్నాయి. సరిపడా బస్తాలు లేకపోవడం, ధాన్యం బస్తాలను ట్రాన్స్పోర్టు చేయడానికి లారీలు లేకపోవడం వల్ల నిల్వ ఉంచిన బస్తాలు వర్షంలో తడవలసిన పరిస్థితి నెలకొన్నది. సింగరేణి మండల వ్యాప్తంగా 8800 ఎకరాలలో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. తక్షణమే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి పరిహారం ప్రకటించాలని రైతులు డిమాండ్ చేసున్నారు.