పాల్వంచ, ఏప్రిల్ 1 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్ ఏడో దశ కర్మాగారం రికార్డుల పరంపర కొనసాగిస్తున్నది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నింట్లోనూ ఈ ఏడాది 79.04 పీఎల్ఎఫ్(ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)తో రాష్ట్రంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. యూనిట్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరాటంకంగా 112 రోజులపాటు విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది. 2019లో యూనిట్ ప్రారంభించిన నాటి నుంచి తన సామర్థ్యాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2019లో యూనిట్ నిర్మాణం పూర్తియినప్పటి నుంచి అత్యధిక పీఎల్ఎఫ్ సాధించి దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కేటీపీఎస్‌లోని 5వ దశ 9వ యూనిట్లో 73.29 పీఎల్ఎఫ్, 10వ యూనిట్లో 58.47 పీఎల్ఎఫ్, 6వ దశలోని 11వ యూనిట్లో 69.74 పీఎల్ఎఫ్ సాధించగా.. రాష్ట్రంలోని భూపాలపల్లి కేటీపీపీ మొదటి దశ 500 మెగావాట్లలో 67.60 పీఎల్ఎఫ్, 2వ యూనిట్లో 66.26 పీఎల్ఎఫ్, మణుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్ 200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లలో మొదటి యూనిట్ 18.49, రెండో యూనిట్లో 72.54 పీఎల్ఎఫ్, 3వ యూనిట్లో 70.51, నాల్గవ యూనిట్లో 63.93 పీఎల్ఎఫ్ సాధించాయి.
నల్లగొండ జిల్లా యాద్రాద్రిలోని ఒకటో యూనిట్లో సీవోడీ అయి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి నిలిపివేశారు. 2వ యూనిట్ 21.18 మెగావాట్ల పీఎల్ఎఫ్ సాధించింది. ఓవరాల్‌గా రాష్ట్రంలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలను పరిశీలిస్తే.. కేటీపీఎస్ ఏడో దశ రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించి తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ యూనిట్ మొదట్లో పనికిరాదని అపోహలు సృష్టించినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ర్టానికి వెలుగులు అందించడంపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు.