కారేపల్లి, జనవరి 21 : సికింద్రాబాద్-మణుగూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (12745) రైలుకు బుధవారం నుండి కారేపల్లి రైల్వే స్టేషన్లో నిలుపుదలను పునరుద్ధరిస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మణుగూరు నుండి సికింద్రాబాద్‌కు వెళ్లేటప్పుడు ఈ రైలుకు కారేపల్లి రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఉండగా తిరుగు ప్రయాణంలో హాల్టింగ్ లేదు. ఈ సమస్యతో పాటు కరోనా సమయంలో రద్దు అయిన మిగతా రైళ్లను పునరుద్ధరించాలని, భద్రాచలం రోడ్డు – తిరుపతి మధ్య కొత్త రైలును నడపాలని ఇటీవల కారేపల్లి పర్యటనకు వచ్చిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డిని స్థానిక సామాజిక కార్యకర్త ఇందుర్తి సురేందర్ రెడ్డి కోరారు. దాంతో స్పందించిన ఎంపీ ఈ విషయాలను రైల్వే జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు. అందులో భాగంగా సికింద్రాబాద్ మణుగూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు కారేపల్లి స్టేషన్లో హాల్టింగ్ కల్పిస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎంపీ రఘురాం రెడ్డికి సామాజిక కార్యకర్త సురేందర్ రెడ్డి, స్థానిక ప్రజలు, ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.