ఉపాధ్యాయుల మ్యుచువల్ (పరస్పర) ట్రాన్స్ఫర్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సీనియార్టీ ఆధారంగా గతంలో జీవో 317 ప్రకారం బదిలీలు జరిగిన విషయం విదితమే. ఈ క్రమంలో సర్వీసులో జూనియర్ అయిన వారు కొందరు కోరుకున్న స్థానాలకు కాకుండా.. ఇతర జిల్లాకు అలాట్ అయ్యారు. అయితే 317 జీవోలో ఇతర జిల్లాలకు కేటాయించబడిన ఉపాధ్యాయులు కోరుకున్న జిల్లాలకు వచ్చేందుకు ప్రభుత్వం మ్యూచువల్ బదిలీలకు అవకాశం కల్పించనున్నది. ఈ నేపథ్యంలో మ్యూచువల్‌కు అంగీకారం తెలిపే టీచర్లతో రూ.లక్షల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన దరఖాస్తులు సైతం స్వీకరించారు. మ్యూచువల్ బదిలీకి దరఖాస్తు చేసుకున్న వారికి శనివారం (ఈ నెల 18న) డీఈవో కార్యాలయంలో సర్వీస్ రిజిస్టర్లను పరిశీలించనున్నారు.
-ఖమ్మం అర్బన్, జనవరి 17
మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్లో ఎక్కువగా త్వరలో ఉద్యోగ విరమణ పొందేవారే ఉన్నారు. దీంతో స్థానిక జిల్లాలను వదులుకొని ఇతర జిల్లాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ విరమణ అనంతరం బెనిఫిట్స్ ఎలాగూ ఇవ్వకపోవడంతో కొన్ని నెలల్లో ఉద్యోగ విరమణ పొందే కొందరు ఉపాధ్యాయులు ఇలాగైనా సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో మ్యూచువల్‌కు అంగీకారం తెలుపుతున్నారు. ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు సైతం మ్యూచువల్ కోరుకునే వారిలో ఉన్నారు. దీంతో ఇప్పటికే వాట్సాప్ గ్రూప్‌లలో సమాచారం షేర్ చేయడం.. ఎవరెవరు మ్యూచువల్ కోరుకుంటున్నారో వివరాలు తెలుసుకుని వారితో ఆర్థికపరమైన అంశాలపై చర్చించుకున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ ప్రాంతాలకు వెళ్లేవారు ఉండగా.. ఇతర ప్రాంతాల నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చే వారూ ఉన్నారు. హెచ్ఆర్ఏ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉండడంతో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకుపైగా డిమాండ్ ఉంది.
జిల్లాలో 45 మంది దరఖాస్తులు
మ్యూచువల్‌కు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల్లో జిల్లా నుంచి 45 మంది ఉన్నారు. వీరికి సంబంధించిన వివరాలను పరిశీలించి విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయానికి అందజేయాలని ఆదేశించిన నేపథ్యంలో శనివారం ఆయా వివరాలను అధికారులు పరిశీలించనున్నారు. బదిలీ కోరుకునే ఉపాధ్యాయుడితోపాటు మ్యూచువల్‌కు అంగీకారం తెలిపిన ఉపాధ్యాయుడు సైతం డిక్లరేషన్ అందజేయాలి. బదిలీ ఉపాధ్యాయులతోపాటు వారు పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుల ధ్రువీకరణ కూడా అందజేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. దీంతో సంబంధిత ఉపాధ్యాయులు ధ్రువీకరణ పత్రం, డిక్లరేషన్‌తోపాటు సర్వీస్ రిజిష్టర్‌లో 317 జీవో ప్రకారం బదిలీ జరిగిందా? లేదా? అనే అంశాలను పరిశీలించనున్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత శనివారం నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనుండడంతో పరిశీలన ప్రక్రియ ప్రారంభించనున్నారు. పరిశీలనకు సోమవారం వరకు కూడా గడువు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.