ఖమ్మం ఎడ్యుకేషన్/ మామిళ్లగూడెం, జూన్ 6: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఐడీవోసీలో గురువారం నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాల్లో స్వచ్ఛత, పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. మండలస్థాయి అధికారులకు క్లస్టర్ల వారీగా బాధ్యతలు అప్పగించి అన్ని పాఠశాలల బడిబాట కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. ఈ నెల 12న పాఠశాలల పునఃప్రారంభం అయ్యేలోగా పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు, యూనిఫాం దుస్తులు పాఠశాలలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈవో సోమశేఖరశర్మ, జడ్పీ సీఈవో వినోద్, డీఆర్డీవో సన్యాసయ్య, వివిధ శాఖల అధికారులు పుష్పలత తదితరులు పాల్గొన్నారు.