యానంబైలు ఉన్నత పాఠశాలకు 13 గ్రామాల నుంచి పిల్లల రాక
ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య
పూర్వ విద్యార్థుల సాయంతో స్కూలు అభివృద్ధి
పాల్వంచ రూరల్, మార్చి 16: ఆ పాఠశాలకు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది.. ఇక్కడ విద్యనభ్యసించిన ఎంతోమంది విద్యావంతులయ్యారు. ఉన్నత స్థానాల్లో కొలువుదీరారు. ఈ బడికి 13 గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చి చదువులు కొనసాగిస్తున్నారు. 1945లో ప్రాథమిక పాఠశాలగా మొదలై.. ప్రస్తుతం ఉన్నత పాఠశాలగా ఎదిగింది. గతంలో ఈ పాఠశాలలో ఏడోతరగతి వరకే చదివే అవకాశం ఉండేది.. ఎనిమిదో తరగతి నుంచి వేరే బడికి వెళ్లాల్సి వచ్చేది. హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత విద్యార్థుల కష్టాలు తీరాయి. ఉన్న ఊర్లోనే 10వ తరగతి చదువుకోవడానికి వీలు కలిగింది. కొన్నేళ్ల నుంచి పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం బోధిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో 98 మంది, ఉన్నత పాఠశాలలో 132 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం ఈ పాఠశాలలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం అమలు చేయనున్నది. ఈ నేపథ్యంలో పాల్వంచ మండలం యానంబైలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నేపథ్యం, అంచెలంచెలుగా ఎదిగిన తీరు.. దాతల చేయూతపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
మండలంలోని యానంబైలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఈ పాఠశాలకు గ్రామం నుంచే కాక చుట్టుపక్కల 13 గ్రామాల నుంచి విద్యార్థులు వస్తారు. 1945లో ప్రాథమిక పాఠశాలగా మొదలైన ఈ ప్రస్థానం ఉన్నత పాఠశాల వరకు సాగిం ది. 1972లో ప్రాథమికోన్నత పాఠశాలగా, 1991 లో హైస్కూలుగా అప్‌గ్రేడ్ అయింది. పునుకుల, సా రెకల్లు, యానంబైలు, పాండురంగాపురం, మందెరికలపాడు, ఉల్వనూరు గ్రామాలకు చెందిన వేలాది మంది ఇక్కడ చదువుకుని విద్యావంతులయ్యారు.
పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య..
యానంబైలు పాఠశాలలో రెండు దశాబ్దాల క్రితం ఏడోతరగతి వరకే చదివే అవకాశం ఉండేది. దీంతో విద్యార్థులు ఎనిమిదో తరగతి నుంచి పాల్వంచలోని పాఠశాలలకు వెళ్లాల్సి వచ్చేది. అప్పట్లో సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత విద్యార్థుల కష్టాలు తీరాయి.ఉన్న ఊర్లోనే 8, 9, 10 తరగతులు చదువుకోవడానికి వీలు కలిగింది. కొన్నేళ్ల నుంచి పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం అమలవుతున్నది. ప్రస్తుతం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 98 మంది, ఉన్నత పాఠశాలలో 132 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
దాతల సాయంతో..
దాతలు పుప్పాల ముత్యం, బుడగం సత్యనారాయణ, యర్రంశెట్టి రామచంద్రయ్య పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించారు. ఓయూ మాజీ వైస్ చాన్స్‌లర్ సత్యనారాయణ పాఠశాలకు మూడు కంప్యూటర్లు అందజేశారు. నవభారత్ కంపెనీ సామాజిక కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలలో టాయిలెట్స్ నిర్మించింది. పాఠశాలలో చదివిన ఎంతోమంది విద్యావంతులయ్యారు. ఉన్నత కొలువులు సాధించారు. దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు. ఇక్కడ చదువుకున్న శిరసాని సత్యనారాయణ ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా సేవలందించారు. పుప్పాల సత్యనారాయణ ప్రొఫె సర్ అయ్యారు. మోతుకూరి వీరబ్రహ్మయ్య గతంలో కరీంనగర్ జిల్లాకు కలెక్టర్‌గా పనిచేశారు. బుడగం వీరయ్య తహసీల్దారుగా సేవలందించారు. ఇంకా ఎంతోమంది అనేక రంగాల్లో రాణిస్తున్నారు.
మున్ముందు మంచి రోజులు
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. బడుల బలోపేతానికి వచ్చే విద్యాసంవత్సరం నుంచి ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం అమలు చేయనున్నది. దీంతో పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. మున్ముందు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
– తుమ్మలపల్లి రామారావు, హెచ్ఎం, యానంబైలు హైస్కూల్