చుంచుపల్లి, జూన్ 13 : రేపటి నుంచి పాఠశాలలు మొదలవుతున్నాయి. ప్రైవేటు స్కూల్లో చదివే చాలామంది విద్యార్థులు ఆ స్కూల్ బస్సుల్లోనే పాఠశాలలకు వెళ్లివస్తుంటారు. అయితే ‘బడి బస్సు భద్రమేనా’ అనే అనుమానం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. బస్సులు ఫిట్నెస్ లేకుండా రోడ్డెక్కితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో ఎన్ని బస్సులు ఫిట్నెస్తో రోడ్డెక్కుతున్నాయో.. ఎన్ని బస్సులు ఫిట్నెస్ లేకుండా రోడ్డెక్కుతున్నాయో రవాణా శాఖ అధికారులకే తెలియాలి మరి.
పాఠశాలల బస్సులు ముందుగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఫిట్నెస్ పరీక్షలను చేయించినాకే రోడ్డెక్కాల్సి ఉంటుంది. ఈ పని అంతా రవాణా శాఖ కార్యాలయంలో జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 254 బడి బస్సులు ఉన్నాయి. దీనిలో 156 బస్సులు మాత్రమే ఇప్పటివరకు ఫిట్నెస్ చేయించుకున్నారు. మిగతా 98 బస్సులకు ఇంకా చేయించాల్సి ఉంది. జిల్లాలో బస్సుల ఫిట్నెస్ విషయంలో కొన్ని విద్యాసంస్థలు అంతగా ఆసక్తి చూపడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం కొత్తగా తెచ్చిన నిబంధనల ప్రకారం వాహనం ఫిట్నెస్ చేయకుంటే రోజుకు రూ.50 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయినా విద్యాసంస్థల్లో చలనం కనిపించడంలేదు.
విద్యార్థులను సురక్షితంగా చేర్చే బాధ్యత ఆయా సంస్థలదే. దీనికోసం ప్రతి బస్సుకు ఫిట్నెస్ టెస్టులు చేయించాలి. ఈ పరీక్షల ధ్రువీకరణ పత్రం లేకుండా రోడ్డెక్కితే బస్సులు సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. బస్సులను ఏర్పాటు చేసిన బోర్డుపై తప్పనిసరిగా దాని వివరాలతోపాటు చోదకుని వివరాలు ప్రదర్శించాల్సి ఉంటుంది. దీన్ని ఎవరూ పాటించట్లేదని తెలుస్తోంది. ప్రతి బస్సులో ప్రథమ చికిత్స పెట్టెలున్నా, వాటిలో మందులు లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా చాలా బస్సులకు ఇండికేటర్లు పగిలిపోయి ఉండటం, అరిగిన టైర్లు, సైడు మిర్రర్లు, ప్రథమ చికిత్స బాక్స్‌లు లేకుండా దర్శనమిస్తున్నాయి. ఈ వాహనాలు రవాణా అధికారుల చేతికి చిక్కితే అంతే సంగతులు.. అయినా దొరికితేనే దొంగలు, దొరక్కపోతే దొరలు అన్న చందంగా తయారైంది పరిస్థితి.
నిబంధనలు పాటించని పాఠశాలల బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డెక్కనివ్వం. ప్రతి బస్సుకు పార్కింగ్ లైట్లు, బస్సులో ఒక సహాయకుడు ఉండేలా చూస్తాం. ప్రయాణించే విద్యార్థుల చిరునామా, చరవాణి నంబర్, చార్టు రూపంలో ఏర్పాటు చేయాలి. వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, పొల్యూషన్, బీమా పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సు, ఆర్టీఏ అధికారులు జారీ చేసిన సామర్థ్య పరీక్షల ధ్రువీకరణ పత్రాలు బస్సుల్లో అందుబాటులో ఉంచాలి. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తే కఠిన చర్యలు తప్పవు.
– వి.వెంకటరమణ, జిల్లా రవాణా శాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం