ఖమ్మం వ్యవసాయం, జూన్ 24 : ఈ నెల 18వ తేదీ వరకు నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకు సైతం రైతుబంధు పథకం వర్తించనున్నది. దీంతో ఈ ఏడాది అదనంగా మరో 15,699 మంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందనున్నది.
అన్నదాతకు అండగా…
నాటినుంచి నేటివరకు పలు రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. విత్తనం నుంచి మొదలుకొని మార్కెటింగ్ వరకు అడుగడుగునా అన్నదాతకు అండగా నిలబడుతున్నది. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ఇతర రాష్ర్టాలకు మార్గదర్శకమయ్యారు. అన్నంపెట్టే రైతు అప్పులపాలు కావొద్దనే ఉద్దేశంతో ఐదేళ్లుగా పంట పెట్టుబడి బాధ్యత తీసుకున్నారు.. పట్టాదారు పాసుపుస్తకం కలిగిన ప్రతి రైతుకు తొలుత ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.8 వేలు అందించారు. అయితే ఏటేటా ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని గత సంవత్సరం నుంచి ఎకరానికి సీజన్‌కు రూ.5 వేల చొప్పున ఏటా రెండు సీజన్లకు రూ.10 వేలు అందిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల రైతులకు సైతం రైతుబంధు వర్తించే విధంగా చర్యలు తీసుకోవడంతో 3.32 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతున్నది. ఇందులో భాగంగానే ఈ వానకాలం సీజన్ రైతుబంధు సొమ్ము సోమవారం నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో జిల్లావ్యాప్తంగా రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
అదునుకు పెట్టుబడి సాయం
సీజన్ వచ్చిందంటే అదునుకు తగ్గట్టుగా విత్తనాలు విత్తుకుంటేనే సకాలంలో పంట చేతికి వచ్చేది. అయితే అదునుకు సాగు చేయాలంటే పెట్టుబడికి డబ్బులు కావాలి. భూమిలో పదునుకు తగ్గట్టుగా విత్తనాలు విత్తుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సోమవారం నుంచి పంటల పెట్టుబడి సాయం రైతులకు అందించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఆలస్యంగా అందిస్తే రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు సిద్ధమైంది. గతంలో మాదిరిగానే తొలుత ఎకరం లోపు భూమి కలిగిన రైతులకు తొలిరోజు, 1-2 ఎకరాలు కలిగిన రైతులకు మరుసటి రోజు ఇలా ప్రాధాన్యత క్రమంలో పంటల పెట్టుబడి సొమ్మును అందజేయనున్నారు.
అదనంగా మరో 15వేల మందికి లబ్ధి
గత సంవత్సరం సీజన్లో లబ్ధి పొందిన రైతులతో పోల్చితే ఈ సంవత్సరం మరో 15,699 మంది రైతులకు రైతుబంధు పథకం వర్తించనున్నది. నూతనంగా భూమి కొనుగోలు చేసిన రైతులకు సైతం పంటల పెట్టుబడి సాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల18వ తేదీలోపు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులకు సైతం ఈ పథకం వర్తించనున్నది. ఇప్పటికే ఆయా గ్రామాల అధికారులు కొత్త పాసు పుస్తకాలు కలిగిన రైతుల నుంచి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను స్వీకరించారు. తొలుత పాత పాసు పుస్తకాలు కలిగిన రైతుల అకౌంట్లో పెట్టుబడి సొమ్ము జమ చేయ నున్నారు. అనం తరం వారికి పంపిణీ చేస్తారు. ఈ వానకాలం సీజన్లో రికార్డు స్థాయిలో 3.32 లక్షల మందికి రైతుబంధు పథకం వర్తించనున్నది.
వేగవంతం కానున్న వ్యవసాయ పనులు
పెట్టుబడి సొమ్ము అందనుండడంతో వ్యవసాయ పనులు వేగవంతం కానున్నాయి. వచ్చే నెల చివరి వరకు వానకాలం సాగు పనులు చివరిదశకు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు రైతులు విత్తనాలు కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. రైతుబంధు అందిన వెంటనే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయనున్నారు. మొత్తం పదిరోజులపాటు రైతుబంధు పంపిణీ కొనసాగుతుండగా తొలుత సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. సాంకేతిక సమస్యలతో ఎవరికైనా రైతుబంధు అందకుంటే వెంటనే సమస్యను పరిష్కరించేందుకు వ్యవసాయ అధికారులు సిద్ధంగా ఉన్నారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
రైతులు అప్పులు చేసి వ్యవసాయం చేయవద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఎనిమిది విడతలుగా పెట్టబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేశారు. ప్రతి సీజన్లో సాగుకు సమయానికి డబ్బులు అందిస్తున్నారు. దీంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండాపోయింది. సాయం అందుకున్న రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసుకోవాలి. సకాలంలో పంటల పెట్టుబడి అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు రైతుల తరఫున కృతజ్ఞతలు.
– నల్లమల వెంకటేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్