‘సర్దార్ సర్వాయి పాపన్న మొట్టమొదటి బహుజన వీరుడు.. నాటి పాలకుల నిరంకుశపాలనపై యుద్ధం చేసిన యోధుడు.. రాచరికపు దోపిడీని వ్యతిరేకించిన ధీశాలి..’ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన వేడుకల్లో వారు మాట్లాడారు. పాపన్న గొప్పతనాన్ని చాటి చెప్పారు. సత్తుపల్లి వేడుకలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం నగరం వేడుకలో మేయర్ పునుకొల్లు నీరజ, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
గౌడ జాతి ముద్దుబిడ్డ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి ఆయన సేవలను కొనియాడారు. గౌడ జాతి ఔన్నత్యానికి చేసిన కృషిని గుర్తుచేసుకొని ఆయన ఆశయాలతో ముందుకు సాగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు, దళిత బహుజనుల సమాజానికి సేవ చేయాలన్నదే సర్ధార్ పాపన్నగౌడ్ లక్ష్యమన్నారు. కారేపల్లిలో గౌడ్హక్కుల పోరాట సమితి, మోకు దెబ్బ ఆధ్వర్యంలో పెద్దమ్మ దేవాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
– నమస్తే నెట్వర్క్