ఖమ్మం, సెప్టెంబర్ 4: మున్నేరు శాంతించింది. ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్‌లోని దాని పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ సర్కారు సహాయ సహకారాలు అందక వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్యం పూర్తిస్థాయిలో మెరుగుపడలేదు. ముంపు ప్రాంత కాలనీలన్నీ ఇంకా చీకట్లోనే మగ్గిపోతున్నాయి.
నిత్యావసర సరుకుల పంపిణీలు అక్కడక్కడా జరుగుతున్నాయి. ఇక మొన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇస్తామన్న రూ.10 వేల సాయం అందనేలేదు. ఇంట్లోని వస్తువులన్నీ కొట్టుకుపోయి, ఇళ్ల నిండా బురద పేరుకుపోయి కష్టాల సుడిగుండంలో ఉన్న ముంపు ప్రాంతాల ప్రజలు మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. అంతులేని ఆవేదనను దిగమింగుకుంటూ నడుం వంచి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు.
ఆయా కాలనీల ప్రజలు తమ ఇళ్లకు పట్టిన బురదను శుభ్రం చేసుకునేందుకు నీళ్ల ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రదాన వీధుల్లోకి ట్యాంకర్లు వస్తున్నా లోపలి ప్రాంతాల్లోకి, కాస్త ఇరుకైన సందుల్లోకి వెళ్లడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ఇళ్లు ఇంకా బురదలోనే ఉన్నాయి. ముంపు ప్రాంతాలైన గణేశ్‌నగర్, మాణిక్యనగర్, బొక్కలగడ్డ, మోతీనగర్ తదితర ప్రాంతాల్లో నాలుగు రోజులైననా బురద బాధ తొలగలేదు. రోడ్లు మాత్రమే కాస్త శుభ్రమయ్యాయి. విద్యుత్ పునరుద్ధరణ ఇంకా జరగలేదు. విరిగిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు.
ప్రభుత్వం 10 కేజీల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను అందిస్తున్నప్పటికీ అవి కూడా పూర్థిస్థాయిలో అందలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, కాంగ్రెస్ నాయకులు వారికి అనుకూలమైన వారికే వాటిని అందజేస్తున్నట్లు స్థానిక వరద బాధితులు ఆరోపిస్తున్నారు. దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నష్టపరిహారం అందించేందుకు అధికారులు బాధితుల ఇళ్లకు వెళ్లి వారి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. .కాలువలు మొత్తం వ్యర్థ్యాలతో నిండి కంపుకొడుతున్నాయి.
మున్నేరు ముంపునకు గురైన ఇళ్లలోని అన్ని రకాల వాహనాలూ బురదలో కూరుకుపోయాయి. ఇంకొన్ని వరదకు కొట్టుకుపోయాయి. అయితే బురదతో కూరుకుపోయి మట్టిపట్టిన వాహనాలను వాటి యజమానులు మరమ్మతుల కోసం షెడ్లకు తరలిస్తున్నారు. బైకులు, కార్ల తాళ్ల సాయంతో లాగుతూ తీసుకెళ్తున్నారు. అయితే వాటి మరమ్మతులకు కూడా రూ.వేలల్లో ఖర్చవుతుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌సీఐ రోడ్డులో నిలిపి ఉన్న లారీల్లోకి కూడా వరద వెళ్లడం, వాటికి బురద పట్టడం వంటి కారణాలతో వాటిని అక్కడే నిలిపి మెకానిక్‌లతో మరమ్మతులు చేస్తున్నారు.
ప్రాణాలు తప్ప మాకు ఏమీ మిగలలేదు. ఇప్పుడు మాకు దిక్కెవరయ్యా.. నాలుగు రోజులైనా ఇళ్లు శుభ్రం చేసుకునే పరిస్థితి లేదు. తాగడానికి కనీసం మంచినీళ్లు లేవు. ఇంట్లో భోజనం లేదు. వరద వస్తుందని ముందే చెప్పినా మా వస్తువులను కాపాడుకునేవాళ్లం. కానీ ఏ ఒక్కరూ చెప్పలేదు. ప్రాణాలు పోతాయేమోనని భయపడ్డాం. కానీ దేవుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డాం. వస్తువులని పోయాయి.
-బోయినపల్లి ఉష, పీఎస్ఆర్ రోడ్, ఖమ్మం
వరదలు ముంచుకొచ్చినప్పుడు మా బతుకులు నీళ్లలోనే ఉన్నాయి. ఆ సమయంలో మమ్ములను కాపాడే వాడే లేడు. కనీసం తాగడానికి మంచి నీళ్లు పోసిన నాథుడు కూడా లేదు. గవర్నమెంటోళ్లు ఇప్పుడొచ్చి మాటలు చెబుతున్నారు తప్ప పేదల గురించి పట్టించుకోవడం లేదు. మా ఇళ్లలోని బురదను శుభ్రం చేసుకోవానికి కూడా నీళ్లు లేవు. ట్యాంకర్లను మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మా కాలనీలకు ప్రభుత్వం వాళ్లు ట్యాంకర్లను పంపలేదు.
-కేతం దేవికమ్మ, ఖమ్మం
దేవుడిలాంటి కేసీఆర్ ఉండి ఉంటే మా బతుకులు ఇలా ఉండేవి కావు. ఇలాంటి ప్రకృతి విపత్తులప్పుడు ఆయన వెంటనే స్పందించిన ముమ్మలను రక్షించేవారు. కానీ ఇప్పుడున్న పాలకులు ముప్పు గురించి మాకు మాటమాత్రంగానైనా చెప్పలేదు. నిరుడు వరదలప్పుడు అప్పటి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కూడా మాలాంటి నిరుపేదలకు ఎంతో చేశారు. నిరుడు వదరలు వచ్చినప్పుడు రాత్రికి రాత్రే రాజమండ్రి నుంచి పడవలు తెప్పించారు. మావాళ్లందరికీ రక్షణగా నిలిచారు.
-పిల్లలమర్రి సోమలక్ష్మి, పీఎస్ఆర్ రోడ్, ఖమ్మం