– మిషన్ భగీరథ పైపులు లీకై వృథాగా పోతున్న తాగునీళ్లు
– పలు కాలనీల్లో మురికి కుంటలుగా మారిన వర్షపు నీళ్లు
– పత్తాలేని వైద్యశాఖ సిబ్బంది
– పట్టించుకోని ఆర్బ్ల్యూఎస్ అధికారులు
కారేపల్లి, ఆగస్టు 29 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. డ్రైనేజీల నిర్మాణం సక్రమంగా లేకపోవడం, శుభ్రం చేయకపోవడం, పూడిక తీయకపోవడం వల్ల మురుగు నీళ్లు పొంగిపొర్లుతున్నాయి. మురికి నీరు రోడ్లపైకి వచ్చి లోతట్టు ఇండ్లలోకి చేరుతుంది. సైడ్ కాల్వల్లో షీల్డ్ ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో ప్లాస్టిక్ వ్యర్ధాలతో డ్రైనేజీలు నిండి పలు కాలనీలలో ప్రజలు రోడ్ల వెంట నడుచుకుంటూ వెళ్తుంటే దుర్గంధం వెదజల్లుతోంది. కాలనీల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి చిట్టడవిని తలపిస్తుండడంతో కారేపల్లి మండల కేంద్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు సింగరేణి మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి, డ్రైనేజీలలో ప్లాస్టిక్ వ్యర్ధాలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో వాటిని తొలగించేందుకు సంబంధిత అధికారులు నత్త నడకన పనులు చేస్తున్నారు.
సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలోని భరత్ నగర్ కాలనీ, సంత దేవాలయం సమీపంలోని కాలనీ, బీసీ కాలనీ, పెద్దమ్మ గుడి కాలనీ, సినిమా హాల్ వెనకాల గల కాలనీ, రైల్వే స్టేషన్ రోడ్, శివారు కాలనీల్లో ఖాళీ స్థలాలు అత్యధికంగా ఉండడంతో వాటిల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి దట్టంగా మారాయి. నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని నిబంధనలు ఉన్నప్పటికీ పట్టించుకునే నాధుడే లేకుండా పోయారు. విష పురుగులు, సర్పాలతో, విపరీతమైన దోమలు ఇళ్లలోకి వస్తున్నాయని కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Karepalli : కారేపల్లిలో పారిశుధ్యం అస్తవ్యస్తం
మండల కేంద్రమైన కారేపల్లి గ్రామంలో పలుచోట్ల మిషన్ భగీరథ పైపులు లీకై నీళ్లు వృథాగా పోతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో గల హెడ్ వాటర్ ట్యాంక్ వద్ద పైపులు లీకై తాగునీళ్లు కలుషితం కావడమే కాకుండా, నిరుపయోగంగా పారుతున్నాయి. కారేపల్లి మండల కేంద్రంలో వైద్యశాఖ సిబ్బంది పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని మండల కేంద్ర ప్రజలు కోరుతున్నారు.
Karepalli : కారేపల్లిలో పారిశుధ్యం అస్తవ్యస్తం