ఖమ్మం, నవంంబర్ 2 : పరిపాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యక్ష దాడులకు పాల్పడుతున్నదని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో తగవని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం(తెలంగాణ భవన్)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని, ఇదే విషయంపై మణుగూరు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గత కొంతకాలంగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్నారని అన్నారు.
బొగ్గు నిక్షేపాలు, మైనింగ్‌కు సంబంధించిన పీఎస్ఆర్, డీఎంఎఫ్టీ నిధులను సింగరేణి ప్రాంతంలో అభివృద్ధి చేయకుండా వందల కోట్ల రూపాయలను దారి మళ్లించడంపై, రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీన మణుగూరు బంద్‌కు రేగా పిలుపునిచ్చారని ఈ విషయాలన్ని కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేక పార్టీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతోనే హైద్రాబాద్‌లో, మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడులు చేస్తున్నదన్నారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడుల సంస్కృతి మంచిదికాదన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి దాడులే చేస్తే కాంగ్రెస్ నాయకులు రోడ్ల మీద తిరిగేవారా అని సండ్ర ప్రశ్నించారు. పోలీసులు, అధికారులు న్యాయం వైపు నిలబడాలని కోరారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో సామినేని రామారావును హత్య చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండించారు. గతంలో బోనకల్లు మండలం గోవిందాపురంలో కూడా ఇలాంటి హత్యనే జరిగిందని ఇది మంచిపద్ధతి కాదన్నారు. మణుగూరులో బీఆర్ఎస్ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్, న్యాయవాద జేఏసీ చైర్మన్ బిచ్చాల తిరుమలరావు, ఉద్యమకారులు ఉప్పల వెంకటరమణ, డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేందర్, కార్పొరేటర్ షేక్ మక్బుల్ తదితరులు పాల్గొన్నారు.