సత్తుపల్లి టౌన్, మే 14 : గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలు, రైతు కేంద్రాలను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పాలకులు రాజకీయ వేదికలుగా మార్చారని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులంతా కలిసి గన్నీ సంచులను వారి ఇళ్లలో పెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఇతర పార్టీల వారికి, రైతులకు బస్తాలు ఇవ్వకుండా వారిని ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆరోపించారు. మార్చి నెలలో వరి కోతలు పూర్తయితే.. మే నెలలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షించడం దారుణమని అన్నారు. ఉమ్మడి జిల్లా రైతుల సమస్యలపై ఇక్కడున్న ముగ్గురు మంత్రులు కూడా కనీసం ఒక్కసారైనా సమీక్షించిన పాపానపోలేదని ధ్వజమెత్తారు. సత్తుపల్లిలో గురువారం పర్యటించిన సండ్ర.. కాకర్లపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి నెలలో 70 శాతం ధాన్యం కల్లాల్లోకి వచ్చిందన్నారు. సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అప్పుడు నోరుమెదపకపోవడంతో రైతుల్లో చాలామంది తమ పంటను దళారులకు అమ్ముకున్నారని అన్నారు. సదరు మంత్రి తీరిగ్గా ఇప్పుడు జిల్లాకొచ్చి సమీక్షిస్తే ప్రయోజనమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వమున్నది రైతుల కోసమా?, వ్యాపారుల కోసమా? అంటూ నిలదీశారు. ‘ఎప్పుడో చేయాల్సిన పనిని ఇప్పుడు చేస్తారా?’ అంటూ మండిపడ్డారు. కనీసం జిల్లాలోని ముగ్గురు మంత్రులు కూడా జిల్లా రైతుల సమస్యలపై సమీక్షించిన పాపానపోలేదని విమర్శించారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేందుకు ఇదే ఉదాహరణ అని స్పష్టం చేశారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి 45 రోజులు గడిచినా ప్రభుత్వం కొనకపోవడం దారుణమని అన్నారు. దీంతో గత్యంతరం లేకనే సదరు రైతులు తమ పంటను దళారులకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, మొక్కజొన్నల కొనుగోళ్ల విషయంలో రైతులను ప్రభుత్వం ఇలాగే ఇబ్బందులపాలు చేస్తోందని మండిపడ్డారు. కల్లూరుగూడెం కొనుగోలు కేంద్రంలో హమాలీలు లేనికారణంగా కొనుగోళ్లు నిలిచిపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, కరోనా కాలంలోనూ అప్పటి సీఎం కేసీఆర్ కర్షకులకు అండగా నిలిచి.. వారు పండించిన పంటలను ఎక్కడివక్కడే కొనుగోలు చేశారని గుర్తుచేశారు. అలాగే, రెండెకరాలున్న రైతులకు రైతుభరోసా జమ చేసేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు నెలలు పడితే.. పది ఎకరాలున్న రైతులకు రైతుభరోసా వేసేందుకు మరి ఇంకెన్నేళ్లు పడుతుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, దొడ్డా శంకర్రావు, కూసంపూడి మహేశ్, బొడ్డు శివ, తుమ్మూరు దామోదర్‌రెడ్డి, కాలినేని వెంకటేశ్వరావు, వీరాపనేని బాబీ, ఎస్కే చాంద్‌పాషా, వల్లభనేని పవన్, మల్లూరు అంకమరాజు తదితరులు పాల్గొన్నారు.