వేంసూరు, మే 11: అభం శుభం తెలియని బాలికపై లైంగికదాడి చేసిన కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ నిందితుడిగా ఉన్నందున సంజయ్‌ను వెంటనే కేంద్రమంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. పోక్సో కేసు నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
మండలంలోని మర్లపాడు గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు గొర్ల రామ్మోహన్‌రెడ్డి నివాసంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు. బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదై రోజులు గడస్తున్నా ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వానికి, బండి సంజయ్‌కు ఉన్న సంబంధం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభ వద్ద ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ బాధిత కుటుంబ సభ్యులు ప్రకటించడంతోనే పోలీసులు కేసు నమోదు చేశారని, లేదంటే కేసు కూడా నమోదు చేసేవారు కాదని ఆరోపించారు.
కేసు నమోదులో ఆలస్యం వెనుక కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు పగుట్ల వెంకటేశ్వరరావు, కంటే వెంకటేశ్వరరావు, పుచ్చకాయల శంకర్‌రెడ్డి, ఎర్రా రమేశ్, గొర్ల ప్రభాకర్‌రెడ్డి, మోరంపూడి శ్రీధర్‌బాబు, మిరియాల ప్రసాద్, మారోజు సురేశ్, మందపాటి వెంకటరెడ్డి, మందపాటి మహేశ్వర్‌రెడ్డి, గరిగంటి రాంబాబు, చక్రధర్‌రావు, దొడ్డ చెన్నకేశవరెడ్డి, కరుణా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.