ఒకవైపు పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుండగా.. మరోవైపు మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. పల్లెల్లో మద్యం ఏరులైపారుతున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటీ నుంచి కోడ్ అమల్లోకి వచ్చినా యథేచ్ఛగా బెల్టుషాపుల్లో మద్యం అమ్మకాలు బహిరంగంగానే సాగుతున్నాయి. వైన్‌షాపులకు దీటుగా గ్రామాల్లో కిరాణా షాపులు పర్మిట్‌రూమ్‌లు, బార్లను తలపిస్తున్నాయి. పల్లెలు, పట్నాలు తేడాలేకుండా విచ్చలవిడిగా బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు సాగుతున్నాయి. అధికారిక దుకాణాల కంటే బెల్టుషాపుల్లోనే అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులకు మాత్రం బెల్టు దుకాణాలు కనిపించటం లేదు. అధికారుల నిర్లక్ష్య వైఖరితో ‘ఎన్నికల కోడ్’ వెక్కిరింతలపాలవుతున్నది. ఏదేమైనా గ్రామాల్లో అధికారులు ‘బెల్టు’ తీస్తేనే ఎన్నికలు ప్రశాంతంగా ముగుస్తాయని ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
-అశ్వారావుపేట, డిసెంబర్ 3

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పల్లె పోరు జోరుమీదున్నది. ఎన్నికల సీజన్ కావడంతో మద్యంప్రియులను రాజకీయ నేతలు మద్యం, విందులతో లొంగదీసుకుంటున్నారు. గతంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే బెల్టు దుకాణాలపై ఉక్కుపాదం మోపే అధికారులు ఈసారి కనీసం కన్నెత్తి చూడకపోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా బెల్టు దుకాణాల అమ్మకాలే ఎక్కువ. మద్యం దుకాణదారులు కూడా వీటిని ప్రోత్సాహిస్తూనే అమ్మకాలు పెంచుకుంటున్నారు. వీటికి అనుమతులు లేకున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోరు. ప్రభుత్వానికి మద్యం విక్రయాల ద్వారా ఆదాయం రావాలన్నా, అధికారులకు ముడుపులు అందాలన్న ఆలోచనతో బెల్టు దుకాణాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.
ఇది సాధారణ సమయంలోని పరిస్థితి. జిల్లాలో వందల్లో మద్యం దుకాణాలు ఉంటే వాటి పరిధిలో బెల్టు దుకాణాలు వేలల్లో ఉంటాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే అధికారులు మొదట దృష్టి పెట్టేది మాత్రం బెల్టు దుకాణాలపైనే. గ్రామాల్లో ఎటువంటి ఘర్షణలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అధికారులు ముందుగా బెల్టు తీస్తారు.. కానీ, ఈసారి పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 10 రోజులు దాటుతున్నా అధికారులు బెల్టు దుకాణాల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. బెల్టు వ్యాపారులపై బైండోవర్ కేసులు నమోదు చేసి, దుకాణాలను కట్టడి చేయాల్సిన అధికారులు ఎటువంటి నియంత్రణ చర్యలు తీసుకోకపోవటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన కొత్త మద్యం దుకాణదారులు ఇంకా సిండికేట్ కాకపోయినా బెల్టు దుకాణదారులు మాత్రం అదనపు వసూళ్ల దందా కొనసాగిస్తున్నారు. క్వార్టర్‌కు రూ.20, ఫుల్‌బాటిల్‌కు రూ.80 వరకు దోచుకుంటూ దండుకుంటున్నారు.
‘బెల్టు’ తీస్తేనే ప్రశాంతంగా ఎన్నికలు
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించటానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఇందులో పోలీసుల ప్రత్యేక బందోబస్తు ముఖ్యంగా ఉంటుంది. వారికితోడు ఎక్సైజ్ అధికారులు బెల్టు దుకాణాలను కట్టడి చేయగలిగితేనే ఎన్నికలు ఎటువంటి ఘర్షణలు లేకుండా సజావుగా సాగుతాయి. రాత్రి 10 గంటకే మద్యం దుకాణాలు మూతపడతాయి. అప్పటినుంచి బెల్టు దుకాణాల హవానే కొనసాగుతోంది. బెల్టు దుకాణాల్లోనే మద్యం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. పీకల్లోతుగా తాగిన తర్వాత గొడవలు చోటుచేసుకుంటాయి. ఇది మితిమీరిన ఘర్షణలకు దారితీసే ప్రమాదమూ ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే అన్ని కార్యక్రమాలు ఎన్నికల సంఘం నియంత్రణలోకి వచ్చేస్తాయి.
అప్పటివరకు ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే అధికారులు ఎన్నికల సంఘం నిబంధనల అమల్లోకి వచ్చేస్తారు. వాహనాల తనిఖీ, నగదు రవాణాపై దృష్టి సారిస్తున్న అధికారులు బెల్టు దుకాణాలకు మద్యం సరఫరాపై ఎందుకు ఫోకస్ పెట్టడం లేదో అర్థంకావడం లేదు. పల్లెల్లో బెల్టు దుకాణాలు విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగిస్తున్నా కనీసం కన్నెత్తి చూడకపోవడంతో అధికారుల ఉదాసీనతకు అద్దం పడుతోందని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు అధికారుల కనుసన్నల్లోనే బెల్టు దుకాణాలు సైతం కొనసాగుతున్నాయనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా సాగాలంటే బెల్టు తీయాల్సిందేనన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తున్నది. లేకుంటే జరగబోవు పరిణామాలకు అధికారులే బాధ్యులవుతారంటూ హెచ్చరిస్తున్నారు.

బెల్టుషాపులకు అనుమతి లేదు
ఎక్కడా కూడా బెల్టు దుకాణాలకు అనుమతి లేదు. ఎవరైనా బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎన్నికల సమయంలో మద్యం అమ్మే వ్యాపారులను గుర్తించి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తాం. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే.
-సాంబమూర్తి, ఎక్సైజ్ సీఐ, అశ్వారావుపేట