భద్రాచలం, అక్టోబర్ 7: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శబరి స్మృతి యాత్ర మంగళవారం శోభాయమానంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు వారివెంట తెచ్చిన వివిధరకాల పుష్పాలు, పత్రాలు, ఫలాలతో రామయ్యకు వన నీరాజనం సమర్పించారు. రామాలయ వీధులన్నీ శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి.
భద్రగిరి ప్రదక్షిణలో రామలక్ష్మణులు, శబరి చిత్రపటాన్ని గిరిజన మహిళలు పట్టుకోగా, సంప్రదాయబద్ధంగా మేళతాళాలు, గిరిజన సాంస్కృతిక కోలాటాలు నిర్వహించారు. రామాలయం సమీపంలోని భక్తరామదాసు, తూము నరసింహదాసు, దమ్మక్క విగ్రహాల వద్ద పూజలు చేశారు. ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద బలిపీఠానికి శబరి జలాలతో గిరిజన మహిళలు అభిషేకం జరిపారు.
అనంతరం మేళతాళాలతో పుష్పాలు, ఫలాలు, పత్రాలను తీసుకొని చిత్రకూట మండపానికి చేరుకొని దేవస్థానం అర్చకులకు వాటిని అందజేశారు. అర్చకులు ముందుగా విశ్వక్సేనార్చన, పుణ్యహావచనం నిర్వహించారు. ఫలాలను స్వామివారికి నివేదన చేసి హారతులతో ప్రత్యేక పూజలు చేశారు. చివరగా నివేదన చేసి ప్రసాదాలు, పుష్పాలు, లడ్డూ ప్రసాదాన్ని గిరిజనులకు అందజేశారు. గిరిజన ముత్తయిదువులకు సారెను ఐటీడీఏ పీవో రాహుల్, దేవస్థానం ఈవో దామోదర్‌రావు అందజేశారు. గిరిజనులకు అన్నదానం నిర్వహించారు. దేవస్థానం ఏఈవోలు శ్రావణ్‌కుమార్, భవానీరామకృష్ణ, గిరిజన నాయకులు పూనెం కృష్ణ, ముర్ల రమేష్, వైదిక పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు.
గిరిజనులెందరో స్వామివారి సేవలో తరించారు: పీవో
రామాలయంలో శబరి స్మృతి యాత్ర, దమ్మక్క సేవయాత్ర పేరుతో గిరిజనులను స్మరించుకుంటూ ఏటా పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయమని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ పేర్కొన్నారు. పుష్పార్చనలో పీవో రాహుల్ మాట్లాడుతూ.. మన్యంలో నివసించే ఎందరో గిరిజనులు రాముని సేవలో తరించారని గుర్తుచేశారు.
శబరిమాత విగ్రహానికి పూజలు
భద్రాచలంలో శబరి స్మృతి యాత్ర సందర్భంగా ఏపీలోని కూనవరంలోని శబరి నది ఒడ్డున ఉన్న శబరిమాత విగ్రహానికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.